కొట్టేయ్‌.. అమ్మేయ్‌! | - | Sakshi
Sakshi News home page

కొట్టేయ్‌.. అమ్మేయ్‌!

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

దొంగ బంగారం కొనుగోలుకు కేరాఫ్‌ నడిగడ్డ

గద్వాల క్రైం: మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉన్న వస్తువుగా మారింది బంగారం. ఒకప్పుడు రూ.వేలల్లో పలికిన పసిడి ధర.. ప్రస్తుతం రూ.లక్షలకు ఎగబాకింది. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం వేసిన ఇళ్లు, ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకుని విచ్చలవిడిగా చోరీలకు పాల్పడుతుండగా.. తస్కరించిన బంగారాన్ని కొందరు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం జిల్లా కేంద్రంలోని స్వర్ణకారుల కాంప్లెక్స్‌లో ఉన్న ఓ వ్యాపారి నుంచి ఏపీ పోలీసులు దొంగ బంగారాన్ని రికవరీ చేయడం హాట్‌ టాఫిక్‌గా మారింది. గుర్తుతెలియని దొంగల నుంచి సదరు వ్యాపారి రూ. 4.50లక్షల విలువైన 29 గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. జిల్లాలోని కొందరు వ్యాపారులు దొంగల నుంచి బంగారం కొనుగోలు చేయడం పరిపాటిగా మారిందనే చర్చ సాగుతోంది.

అక్రమ దందాకు తెర..

ప్రస్తుతం బంగారం వ్యాపారంలోనే ఆశించిన లాభాలు ఉన్నాయి. సామాన్యుడు, ధనికుడు, మధ్యతరగతి అని తేడా లేకుండా సామర్థ్యానికి మించి ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే కొందరు వ్యాపారులు దొంగ బంగారం కొనుగోలుతో అక్రమ దందాకు తెర తీస్తున్నారు. మరోవైపు తరుగు, ప్యూరిటీ, జీఎస్టీ ఇతరాత్ర అంశాల్లో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కూడా వ్యాపారులకు కలిసి వస్తుందని తెలుస్తోంది.

చర్యలు శూన్యం..

దొంగల నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి పోలీసులు రికవరీ చేస్తున్నారు తప్ప.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వ్యాపారుల్లో ఎలాంటి భయం లేకుండాపోతోంది. సాధారణంగా దొంగ బంగారం కొనుగోలు చేసినా.. విక్రయాలు చేసినా శిక్షార్హులు. అయితే సొమ్ము రికవరీ సమయంలో వ్యాపారులు అదనంగా ఎంతో కొంత ముట్టజెప్పుతుండటంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, రికవరీ చేసిన ఆభరణాలను సైతం బాధితులకు అందించడంలో చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తాజాగా నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీసులు ఇక్కడి వ్యాపారి నుంచి రికవరీ చేసిన ఆభరణాలను పూర్తిస్థాయిలో చూపించలేదని వ్యాపారులు చెబుతున్నారు. దొంగల నుంచి బంగారు ఆభరణాల కొనుగోలుచేసే వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయడుతున్నారు.

వ్యాపారులకు లాభసాటిగా మారిన వైనం

తరచుగా ఇతర రాష్ట్రాల పోలీసుల తనిఖీలు

చోరీ సొమ్ము రికవరీకే పరిమితం

తాజాగా 29 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement