ఉపాధి ‘హామీ’ అంతంతే..
తలసరి ఆదాయంలో అట్టడుగునే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు
● నారాయణపేట జిల్లా
రాష్ట్రంలోనే 29వ స్థానం
● జీడీడీపీలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజ
● తెలంగాణ సోషియో ఎకనామిక్
అవుట్ లుక్ సర్వేలో వెల్లడి
సాక్షి, నాగర్‌కర్నూల్: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్ మినహా నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు తలసరి ఆదాయం విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 28వ స్థానంలో కొనసాగుతుండగా, జోగుళాంబ గద్వాల జిల్లా 26వ స్థానంలో ఉంది. వస్తు సేవల ఉత్పత్తిలో ప్రామాణికంగా నిలిచే జీడీడీపీ విషయంలోనూ ఈ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వే 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఏడాదిలో వ్యక్తులకు లభిస్తున్న సగటు ఆదాయం విషయంలో మహబూబ్‌నగర్ మినహా మిగతా జిల్లాలు అట్టడుగునే కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ తలసరి ఆదాయం రూ. 3.36 లక్షలతో రాష్ట్రంలోనే 6వ స్థానంలో మెరుగ్గా ఉంది. నారాయణపేట జిల్లా రూ.2.59 లక్షల తలసరి ఆదాయంతో 28 స్థానంలో, గద్వాల జిల్లా రూ. 2.66 లక్షలతో 26వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా రూ.2.74 లక్షలతో 21వ స్థానం, నాగర్‌కర్నూల్ జిల్లా రూ. 2.79 లక్షల తలసరి ఆదాయంతో 19వ స్థానంలో నిలిచింది.
వస్తుసేవల ఉత్పత్తిలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. ప్రస్తుత ధరల వద్ద జీడీడీపీ రూ.37,456తో మహబూబ్‌నగర్ జిల్లా 11వ స్థానంతో మెరుగ్గా కనిపిస్తుండగా, మిగతా జిల్లాలు వెనుకబడ్డాయి. నారాయణపేట జిల్లా రూ.17,278 జీడీపీపీతో 29వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా 27వ స్థానం, గద్వాల 26వ స్థానం, నాగర్‌కర్నూల్ జిల్లా 19వ స్థానంలో ఉంది.
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఆశించినంతంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. చిన్న తరహా పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ద్వారా స్థానికులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కానీ ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తక్కువగా ఉంది. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 8,165 ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుకాగా, అతి తక్కువగా నారాయణపేట జిల్లాలో 2,298 యూనిట్లు మాత్రమే ఉన్నాయి.
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించి వారి ఆదాయం పెంచాల్సి ఉండగా, ఉమ్మడి జిల్లాలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కూలీలకు లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం లేదు. ఉపాధి హామీలో లక్ష్య సాధన విషయంలోనూ మహబూబ్‌నగర్ మినహా మిగతా జిల్లాలు వెనుకే ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 88.60 శాతం లక్ష్యం చేరుకోగా, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 73.10 శాతం, గద్వాల జిల్లాలో 74.60 శాతం, నారాయణపేట జిల్లాలో 77.40 శాతం, నాగర్‌కర్నూల్ జిల్లాలో 81.60 శాతం లక్ష్యం నెరవేరింది.
వ్యవసాయ రంగంలో మిశ్రమ పంటల విధానం, పంటల సాంద్రతలో ఉమ్మడి జిల్లా చివరన ఉంది. వనపర్తి జిల్లాలో పంటల సాంద్రత 169 కాగా, మహబూబ్‌నగర్‌లో 146, నాగర్‌కర్నూల్ 143, నారాయణపేట 133, గద్వాలలో 132 పాయింట్లుగా పంటల సాంద్రత నమోదైంది.


