అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో ప్రత్యేక నిధులు సమకూరుస్తారని భావించగా, కేవలం రూ.1,800 కోట్ల కేటాయింపులు దక్కాయి. గతేడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.2,514 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.714 కోట్ల తగ్గించారు. కాగా.. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం మొత్తం రూ.4252.53 కోట్లు కేటాయించగా... మక్తల్– పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పెద్దపీట వేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
సంక్షేమం కోసం కొత్త పథకాలు..
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగిజావతో చేసిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలుకానుంది. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ టూ వీలర్ వాహనాలను పంపిణీ చేయనున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఉపాధి, భాషా నైపుణ్యాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేయనున్నారు.
పెండింగ్‌లో ఉన్న వాటికి..
ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంపాటు పెండింగ్‌లోనే ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనుల కోసం రూ.800 కోట్లు కేటాయించింది. కోయిల్‌సాగర్ కోసం రూ.56.13 కోట్లు, సంగంబండ రూ.25.23 కోట్లు, ఆర్డీఎస్ రూ.88 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు రూ.232.50 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ. 119.22 కోట్లు, జూరాల రిజర్వాయర్ గేట్ల మరమ్మతు, ఇతర పనుల కోసం రూ.3 కోట్లు కేటాయించింది.
ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు
మక్తల్– పేట–కొడంగల్
లిఫ్టులకు పెద్దపీట
‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టులకు మరోసారి నిరాశే..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.800 కోట్లు
ఇందిరమ్మ ఇళ్ల
నిర్మాణానికి వెచ్చింపు


