అయిజ: అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. శుక్రవారం అయిజలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన భవనం అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ వైద్య సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌లో సరైన సంతకాలు చేయకపోవడం, లీవ్ లెటర్ ఇవ్వకుండా గైర్హాజరు కావడం, సంతకాలు పెట్టి వెళ్లిపోవడం వంటి కారణాలతో 9 మందికి షోకాజు నోటీసులు ఇవ్వాలని డీఎంహెచ్‌ఓ సంధ్య కిరణ్మయిని ఫోన్‌లో ఆదేశించారు. అలాగే ఒకరిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీశ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం, హెచ్‌పీ గ్యాస్ గోదాంలను సందర్శించారు. ఏజెన్సీ నిర్వాహకులు రాంకుమార్‌తో మాట్లాడి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య, గోదాంకు ప్రతిరోజు వస్తున్న సిలిండర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, నిర్ణీత గడువులోగా గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్న వారికి ఓటీపీ వస్తుందని, నిబంధనలు పాటించకుండా బుక్ చేసుకుంటే ఉపయోగం లేదని చెప్పారు. ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులుతీరకుండా వారికి అవసరమైన సమాచారాన్ని అందజేసేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని డీపీఆర్‌ఓ స్వామికుమార్‌ను ఆదేశించారు. అనంతరం కేజీబీవీలో వంటలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి ఆరాతీశారు. ఏవైనా సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని సూచించారు. అలాగే ఆగ్రో రైతు సేవా కేంద్రం తనిఖీ చేసి.. స్టాక్ రిజిస్టర్, ధరల పట్టికను పరిశీలించారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ వేగవంతం చేయాలని ఆదేశించారు.


