ఉమ్మడి జిల్లాకు ఆశాదీపంగా ఉన్న పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మరో 20 నెలల్లో ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెబుతోంది. అయితే ఈ మేరకు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా కనీసం రూ.22 వేల కోట్లు అవసరమని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లెక్కన ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేయాలంటే ఈ బడ్జెట్‌లోనే సింహభాగం నిధులు అవసరం. కానీ, ఇందుకు బదులుగా కేవలం రూ.1, 800 కోట్లే కేటాయించడంతో పనుల పురోగతిపై నీలినీడలు అలుముకొన్నాయి. రూ.20 వేల కోట్లకుపైగా నిధులు అవసరం ఉంటే ఇంత తక్కువ కేటాయించడంపై సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం కష్టమేనన్న భావన నెలకొంది.
కొడంగల్‌కు అధిక ప్రాధాన్యం..
ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో పేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యం లభించింది. తొలుత రూ.4,350 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ను రెండు విడతల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత కోసం రూ.1,126 కోట్లను కేటాయించగా.. రెండో విడత కింద మరోసారి రూ.2,945 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసేందుకు తాజాగా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,103.28 కోట్ల కేటాయింపులు దక్కాయి.
రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా, రెండో విడతలోనూ కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది.


