ఆత్మకూర్: జూరాల–కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తిచేసి తీరుతామని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసేది లేదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. శనివారం రంజాన్ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 87 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఆత్మకూర్‌కు గత వైభవం తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, హైలెవల్ వంతెన నిర్మాణాన్ని అడుగడుగున అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పురపాలికలో రెండేళ్ల వ్యవధిలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని చెప్పారు.
పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం...
అమరచింత: పదవులు ముఖ్యం కాదని.. మనం చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత పుర కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన పుర సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు వారి సేవకు పునరంకితం కావాలని సూచించారు. మండలంలో కొత్తగా గోదాంల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మండలానికి మొదటి విడత 450 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. అవి పూర్తిచేస్తే మరో 500 ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మున్సిపాల్టీకి రూ.15 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. పురపాలికకు పొక్లెయిన్, డోజర్ మంజూరు చేయాలని చైర్‌పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్‌పర్సన్ రాధ మంత్రికి విన్నవించగా.. ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ కల్లుగీత సెల్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, కౌన్సిలర్లు మాధవి, రాములు, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, నాయకులు తౌఫిక్, శ్యామ్, కమలాకర్‌గౌడ్, నందిమళ్ల సర్పంచ్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


