గ్రామాల్లో పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత

Mar 8 2026 7:36 AM | Updated on Mar 8 2026 7:36 AM

అలంపూర్‌/ మానవపాడు: గ్రామాల్లో పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు అన్నారు. అలంపూర్‌ మండలంలోని కాశీపురం, మానవపాడు మండల కేంద్రంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను ఆయన శనివారం పరిశీలించారు. ముందుగా కాశీపురంలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి శుభ్రపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలని, తద్వారా రీసైక్లింగ్‌ చేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతర చెత్తను కాల్చడం వలన వచ్చే పొగతో శ్వాస సంబంధ, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు పద్మావతి, రాఘవ, సర్పంచ్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement