వైభవంగా వేంకటేశ్వరుడి దర్బారు సేవ
● ముత్యాల అలంకరణలో
మెరిసిన స్వామివారు
● మన్యంకొండలో కొనసాగిన భక్తుల రద్దీ
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి వేంకటేశ్వరస్వామి దర్బారు సేవ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా మన్యంకొండ దేవస్థానం నిర్మాణ మూల పురుషుడు అళహరి రామయ్య చిత్రపటానికి హారతితో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దర్బారు సేవ జరిపారు. శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారిని గర్భగుడి నుంచి మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సేవలో స్వామివారు ముత్యాల అలంకరణలో భక్తకోటికి దర్శనమిచ్చారు. అలాగే పల్లకీలో స్వామివారి సుదర్శన పెరుమాళ్లను గర్భగుడి నుంచి తేరు మైదానం సమీపంలో ఉన్న హనుమద్దాసుల కోనేరు మీదుగా దిగువ కొండ వద్దనున్న శ్రీఅలివేలు మంగతాయారు దేవస్థానం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజల అనంతరం తిరిగి మళ్లీ సుదర్శన పెరుమాళ్లను పల్లకీలో గుట్టపై ఉన్న గర్భగుడి వద్దకు తీసుకువచ్చారు. పల్లకీలో స్వామివారి సుదర్శన పెరుమాళ్లు పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
ముగిసిన సేవలు
మన్యంకొండ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గత నెల 28న ప్రారంభమైన స్వామివారి సేవలు శుక్రవారం ముగిశాయి. ప్రతిరోజు రాత్రి స్వామివారి వివిధ సేవలను నిర్వహించారు. సేవలు ముగిసినప్పటికీ మార్చి 1న దిగువ కొండ వద్దనున్న శ్రీఅలివేలు మంగతాయారు ఉత్సవాలు ప్రారంభమయ్యే వరకు దేవస్థానం వద్ద జాతర కొనసాగనుంది.
వైభవంగా వేంకటేశ్వరుడి దర్బారు సేవ
వైభవంగా వేంకటేశ్వరుడి దర్బారు సేవ


