
డీసీసీ అధ్యక్షులపై కసరత్తు
● వనపర్తి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. లక్కాకుల సతీష్, రాజేంద్రప్రసాద్, డి.కిరణ్ కుమార్ డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దుతో ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇదే క్రమంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడం.. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న డీసీసీ అధ్యక్ష పీఠాల భర్తీకి కసరత్తు ప్రారంభించడంతో పార్టీలో మళ్లీ సందడి మొదలైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఖరారుకు సంబంధించి ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులైన వారు జిల్లాల బాట పట్టారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల పరిశీలకుడు కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి శనివారం పాలమూరుకు చేరుకున్నారు. ముందుగా నారాయణపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌కు చేరుకుని స్థానిక నేతలతో ముచ్చటించారు. ఆదివారం నుంచి ఈ రెండు జిల్లాల్లో అభిప్రాయాల సేకరణతో పాటు డీసీసీ అధ్యక్షుల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా మరో పరిశీలకుడు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆదివారం నాగర్‌కర్నూల్, 14న వనపర్తి, 16న జోగుళాంబ గద్వాలలో పర్యటించనున్నారు.
● నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరికల్ మండలం తీలేరుకు చెందిన ఆయనతో పాటు మక్తల్ మండలానికి చెందిన బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ధన్వాడ మండలంలోని గోటూరు నాగేశ్వర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలానికి చెందిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, కోస్గి మండలం పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మద్దూరు మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి సైతం డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లాల వారీగా పోటాపోటీ ఇలా..
● మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి డీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఆయనతో పాటు ఈ పదవి కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకుడు ఎన్‌పీ వెంకటేష్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ ప్రధానకార్యదర్శి సిరాజ్‌ఖాద్రి పోటీపడుతున్నారు.
● జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు వర్గాల మధ్య డీసీసీ పదవికి పోటీ నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గంలోని గద్వాలకు చెందిన గడ్డం కృష్ణారెడ్డి, మల్దకల్ మండలానికి చెందిన పటేల్ ప్రభాకర్‌రెడ్డి.. జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత భర్త తిరుపతయ్య, మల్దకల్‌కు చెందిన నల్లారెడ్డి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ నాయకుడు సంపత్‌కుమార్.. సరిత వర్గంలోని నల్లారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
● నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు హబీబ్, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్‌కుమార్ రెడ్డి, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది.
నవంబర్‌లో ఖరారయ్యే అవకాశాలు
ఏఐసీసీ పరిశీలకులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. అదేవిధంగా అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతల నుంచి ఈ నెల 18వ తేదీ దాకా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వడబోత తర్వాత ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ఈ నెల 22వ తేదీ నాటికి అటు ఏఐసీసీ, ఇటు పీసీసీకి అందజేయనున్నారు. అనంతరం సీఎం ఇతర ముఖ్య నేతలు జిల్లా ఇన్‌చార్జిలు, ఇన్‌చార్జి మంత్రులు, ఆయా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో సంప్రదింపులు జరిపి సామాజిక వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్, మహిళ) వారీగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కేటాయించనున్నారు. మొత్తానికి వచ్చే నెల తొలివారంలో డీసీసీ అధ్యక్షులు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆశావహులు తాము చేసిన దరఖాస్తుల్లో పార్టీకి అందించిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొంటూ బయోడేటా ఇవ్వాలని పరిశీలకులు సూచిస్తున్నారు.
జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకులు
పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ
ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
18 వరకు కొనసాగనున్న ప్రక్రియ
ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ప్రతిపాదన
5 జిల్లాల్లోనూ పలువురి మధ్య పోటాపోటీ