
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
గట్టు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఎం నిరంతరం పోరాటం చేస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ.. మండలంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతవుతున్నారన్నారు. అక్షరాస్యతలో అత్యంత వెనుకడిన ప్రాంతమని, ఈ ప్రాంత విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయులు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీర్చాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సరైన రవాణా సౌకర్యం లేక గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి బీడు భూములకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిని సారించాలని పేర్కొన్నారు. వీవీ నర్సింహ, నర్మద, మండల కార్యదర్శి గట్టు తిమ్మప్ప, నాయకులు ఆంజనేయులు, రెడ్డెప్ప, నర్సింహులు, శాంతిరాజు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.