
బీచుపల్లిని సందర్శించిన జిల్లా జడ్జి
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శనివారం జిల్లా జడ్డి ఎన్. ప్రేమలత సందర్శించారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ ఈఓ రామన్‌గౌడ్ సిబ్బందితో కలిసి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ విశిష్టతను గురించి వారికి వివరించారు. జడ్జి వెంట కుటుంబ సభ్యులు, సిబ్బంది ఉన్నారు.
ఆదిశిలా క్షేత్రంలో
భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, ఆలయ సిబ్బంది ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు పాల్గొన్నారు. అలాగే, సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలకుపటిష్ట భద్రతా ఏర్పాట్లు
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలను వైభవంగా జరుపుకొందామని అదనపు ఎస్పీ రత్నం అన్నారు. శనివారం మండలంలోని అమ్మాపురంలో వెలసిన కురుమూర్తిస్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాల ఏర్పాట్ల పనులను ఆయన పరిశీలించారు. జాతర మైదానంలోని ఉద్దాల మండపం, జాతర మైదానం, బస్టాండ్, ఆలయ ఎక్కుడు, దిగుడు మెట్లు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. లక్షలాది మంది భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో
భగవద్గీత కంఠస్థ పోటీలు
స్టేషన్ మహబూబ్‌నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఐదు కేంద్రాల్లో భగవద్గీత కంఠస్థ, భావ విశ్లేషణ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ జిల్లా కార్యక్రమ నిర్వాహకులు రామాచారి తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడు విభాగాల్లో భగవద్గీత కంఠస్థ పోటీలు ఉంటాయన్నారు. మొదటి గ్రూప్‌లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు 14వ అధ్యాయం గణత్రయ విభాగ యోగం, రెండో గ్రూప్‌లో పదో తరగతి నుంచి ఇంటర్ వరకు 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం, మూడో గ్రూప్‌లో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణపై పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 8, 9 తరగతులకు, 18 ఏళ్లలోపు 18 ఏళ్లు పైబడిన వారికి సంపూర్ణ భగవద్గీత 700 శ్లోకాలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 11న నారాయణపేటలోని గీతా భారతి స్కూల్, 18న గద్వాలలోని శ్రీసరస్వతి టాలెంట్ స్కూల్, 23న వనపర్తి జిల్లా తాటిపాములలోని శ్రీరీతాంబర విద్యాలయం, 25న మహబూబ్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో, 27న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో కంఠస్థ, భావ విశ్లేషణ పోటీలు ఉంటాయని చెప్పారు. ఈ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు.

బీచుపల్లిని సందర్శించిన జిల్లా జడ్జి

బీచుపల్లిని సందర్శించిన జిల్లా జడ్జి