
అన్నను కాపాడబోయి తమ్ముడు..
● చెక్‌డ్యాంలో మునిగి ఇద్దరు సోదరుల మృతి
● చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
● తల్లి ఏడాది దినకర్మ చేయడానికి వచ్చి మృత్యువాత
● వనపర్తి జిల్లా బలీదుపల్లిలో విషాదం
అడ్డాకుల: తల్లి చనిపోయి ఏడాది కావడంతో దినకర్మ చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు పట్నం నుంచి ఊరికి వచ్చారు.. కార్యం పూర్తిచేసిన మరుసటి రోజు సరదాగా చేపలు పట్టేందుకు చెక్‌డ్యాం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నీటి సుడిలో మునిగిపోతున్న అన్నను కాపాడబోయి తమ్ముడు కూడా మృతిచెందిన విషాదకర సంఘటన వనపర్తి జిల్లా బలీదుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. బలీదుపల్లి గ్రామానికి చెందిన మంద యాదయ్య, మణెమ్మ దంపతులకు నలుగురు కుమారులు ఉన్నారు. అందరూ హైదరాబాద్‌లో ఉంటూ ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే గతేడాది మణెమ్మ చనిపోవడంతో ఏడాది దినకర్మ చేయడానికి నలుగురు కుమారులు కుటుంబాలతో కలిసి రెండు రోజుల కిందట బలీదుపల్లికి వచ్చారు. శుక్రవారం మణెమ్మ ఏడాది దినకర్మ పూర్తి చేశారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో పెద్ద కుమారుడు మంద సుధాకర్ (32), చిన్న కుమారుడు మంద సాయి(25) మరో తమ్ముడు మంద కుమార్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి రెండు ఆటోల్లో గ్రామానికి సమీపంలో ఉన్న పెద్దవాగు చెక్‌డ్యాం వద్దకు వెళ్లారు. దుస్తులు శుభ్రం చేసుకుని కొద్దిసేపు సరదాగా గడిపొద్దామని అక్కడికి చేరుకున్నారు. అయితే చెక్‌డ్యాం దిగువన చేపలు కనిపించడంతో వెంటనే సుధాకర్ చేపలు పడతానంటూ నీళ్లలోకి దిగాడు. చెక్‌డ్యాం దిగువన నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీటి సుడి వద్దకు వెళ్లిన సుధాకర్ అందులో చిక్కుకుని మునిపోతూ కనిపించాడు. వెంటనే గుర్తించిన తమ్ముడు మంద సాయి నీళ్లలోకి దిగి అన్నను కాపాడే ప్రయత్నం చేయగా.. ఇద్దరూ నీటి సుడిలో చిక్కుకున్నాడు. ఇద్దరు అందులో కొట్టుమిట్టాడుతుండగా.. కొద్దిదూరంలో ఉన్న మరో తమ్ముడు మంద కుమార్ నీటిలోకి దిగి ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. ప్రాణాలకు తెగించి కుటుంబసభ్యుల సాయంతో ఇద్దరిని ఒడ్డుకు చేర్చగా.. పెద్ద కుమారుడు మంద సుధాకర్ అప్పటికే మృతిచెందాడు. కొన ఊపిరితో ఉన్న చిన్న కుమారుడు సాయిని అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందాడు. సుధాకర్‌కు భార్య మమత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయికి ఇంకా పెళ్లి కాలేదు. కాగా ఇద్దరు సోదరులు ఒకేరోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తుల చేత కంటతడి పెట్టించాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను జనరల్ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లి దినకర్మకు వచ్చిన కుమారులను మృత్యువు కబలించడంతో బంధువులు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు.
మంద సుధాకర్ (ఫైల్)
మంద సాయి (ఫైల్)

అన్నను కాపాడబోయి తమ్ముడు..