అలంపూర్: అర్హత లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వైద్యం చేస్తే తగిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ సిద్ధప్ప అన్నారు. అలంపూర్‌లో క్లీనిక్‌ల పేరుతో ఆర్‌ఎంపీలు నడుపుతున్న ఆస్పత్రులు, ల్యాబ్‌లను తనిఖీలు చేశారు. అక్కడి వసతులు, పరికరాలు, మందులను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. కొంత మంది ఆర్‌ఎంపీలు ప్రైవేటు ఆస్పత్రులను నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయని, అందుకే ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశామన్నారు. ఆర్‌ఎంపీలు స్థాయికి మించి వైద్యం అందిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. తొలిసారి కావడంతో అందరికి హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. వ్యవహర శైలిలో మార్పు లేకుండా ప్రజలకు స్థాయికి మించి వైద్యం అందిస్తే చర్యలు చేపడతామన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ అలంపూర్ మండలంలోని క్యాతూర్ పీహెచ్‌సీని, అక్కడి రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీకి వచ్చిన మందులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు వీరితోపాటు పీఓ ప్రసూనరాణి, మండల వైద్య అధికారి భరత్, ఎంపీహెచ్‌ఈఓ సత్యనారయణ, హెచ్‌ఎస్ ఉలిగమ్మ, ఫార్మాసిస్టు రవికుమార్, హెచ్‌ఏ బాలిశ్వరయ్య శేట్టి, నాగశేషయ్య, ఈఓ మధుసుధన్ రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు.