పకడ్బందీగా భూభారతి చట్టం అమలు
రాజోళి: ప్రభుత్వం రైతుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బీఎం.సంతోష్ తెలిపారు. మండల కేంద్రం రాజోళిలోని రైతు వేదికలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు. గతంలో ఉన్న ధరణి వల్ల పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలను పరిష్కరించి, వారికి సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. దీని వల్ల సాదా బైనామాలు, హద్దు పంచాయతీలు, సర్వే ఇబ్బందులు తదిదర అంశాలకు సంబందించిన సమస్యలను పరిష్కరించే విధంగా చట్టం తయారు చేయబడిందని తెలిపారు. మేధావులు, విద్యావంతులు రూపొందించిన ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉందని, తహసీల్దార్ ఉత్తర్వులపై ఆర్డీఓ, కలెక్టర్ వద్దకు వెళ్లి అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించబడిందన్నారు. వారసత్వ భూమి మార్పిడిలో సర్వేయర్ ఇచ్చే కమతం నక్షను జత చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయని, అలాంటి అంశాలను ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. భూముల విరాసత్ సమయంలో కుటుంబ సభ్యులు అందరికీ నోటీసులు అందించి, రిజిష్ట్రేషన్ సమయంలో ఆటంకాలు తలెత్తకుండా చూసే విధంగా చర్యలుంటాయన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ భూ బారతి చట్టం ద్వారా రైతులు తమకు ఉన్న సమస్యలను స్థానిక అధికారుల దగ్గరకు తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప,వైస్ చైర్మన్ కుమార్,తహసీల్దార్ పి.రామ్మోహన్,ఎంపీడీఓ ఖాజా మెయినుద్దీన్,వ్యవసాయ అధికారి సురేఖ ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
పాత సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం
కలెక్టర్ బీఎం.సంతోష్


