ఎమ్మెల్యే చిట్టెంపై అసమ్మతి జ్వాలలు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చిట్టెంపై అసమ్మతి జ్వాలలు

Sep 5 2023 12:46 AM | Updated on Sep 5 2023 12:08 PM

షాద్‌నగర్‌ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో సమావేశమైన అసమ్మతి నేతలు   - Sakshi

షాద్‌నగర్‌ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో సమావేశమైన అసమ్మతి నేతలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు తర్వాత పాలమూరులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థులను మార్చాలంటూ రోజురోజుకూ అసమ్మతి స్వరాలు పెరుగుతుండడంతో వేడి రాజుకుంటోంది. తొలుత జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో అసంతృప్తి జాడలు వెలుగులోకి రాగా.. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో బట్టబయలయ్యాయి. తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్‌ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా రెబల్స్‌ మూకుమ్మడిగా అసమ్మతి గళం వినిపించడం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

మక్తల్‌ బచావో అంటూ...
మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు షాద్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం అర్ధరాత్రి సమావేశమైనట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ నాయకుడు, వీజేఆర్‌ ఫౌండేషన్‌ అధినేత వర్కటం జగన్నాథ్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ట్రేడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవర మల్లప్ప, బీకేఆర్‌ ఫౌండేషన్‌ అధినేత బాలకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ఐదు మండలాలకు చెందిన అసంతృప్తులు సుమారు 120మంది వరకు భేటీ అయినట్లు సమాచారం.

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తప్ప.. మక్తల్‌లో ప్రత్యేకంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని.. ఆయనకు టికెట్‌ ఇస్తే బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని.. ఆయనకు సహకరించేది లేదంటూ అసమ్మతి నేతలు ముక్తకంఠంతో తమతమ అభిప్రాయాలను వెల్లడించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్యే నిధులతో ఏయే ప్రాంతాలు అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేయడంతో పాటు చిట్టెం హటావో.. మక్తల్‌ బచావో నినాదాలు చేసినట్లు సమాచారం.

ఎటు దారితీస్తాయో..
ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని సీట్లను సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే కేటాయిస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానంగా కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబికగా.. అలంపూర్‌లో అక్కడక్కడ అసమ్మతి రాజుకుంది. వీటిపై దృష్టి సారించిన కేసీఆర్‌ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అసమ్మతి నేతలను బుజ్జగించేలా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు మంత్రి హరీశ్‌రావు, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కల్వకుర్తి అసమ్మతి నేతలతో వారు ఓ దఫా సంప్రదింపులు జరపగా.. త్వరలో అలంపూర్‌ నియోజకవర్గంలోని అసంతృప్త నేతలతో సమావేశానికి రంగం సిద్ధం చేశారు. ఈ తరుణంలో కొత్తగా మక్తల్‌ సెగ్మెంట్‌కు సంబంధించి అసమ్మతి కార్యకలాపాలు వెలుగుచూడడంతో ఈ పరిణామాలు ఎటుదారి తీస్తాయోననే ఆందోళన గులాబీ శ్రేణుల్లో నెలకొంది.

ఇతర పార్టీల  నాయకులతో కలిసి..!
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌కు చెందిన నర్వ మండలానికి చెందిన సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ బంగ్ల లక్ష్మీకాంత్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్‌, మక్తల్‌ మండలానికి చెందిన గోపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ రవికుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, మాజీ సర్పంచ్‌ సూర్యనారాయణ గుప్త, ఉద్యమకారుడు నీలప్ప ముదిరాజ్‌, మాగనూర్‌ మండలానికి చెందిన మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, శివరామిరెడ్డి, ఒడ్వాటి రఘుతో పాటు ఉట్కూరు, కృష్ణా మండలాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన బీకేఆర్‌ ఫౌండేషన్‌ అధినేత బాలకృష్ణారెడ్డి, ఇదే పార్టీకి చెందిన మక్తల్‌ మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకుడు మక్తల్‌ మండలం చిట్యాల ఎంపీటీసీ సభ్యుడు రామలింగప్ప తదితరులు సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎమ్మెల్యే వ్యతిరేకులను ఏకతాటిపైకి తేవడంతో పాటు మక్తల్‌ నియోజకవర్గ కేంద్రంలో భారీ ఎత్తున సమావేశం నిర్వహించేలా అసమ్మతి నేతలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

..లేదంటే కఠిన నిర్ణయమే..!
ఉమ్మడి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజురోజుకూ అసమ్మతి రాజుకుంటుండడంపై బీఆర్‌ఎస్‌ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. మక్తల్‌లో ఇతర పార్టీల నేతలతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు అసమ్మతుల సమావేశం నిర్వహించడంపై ఫిర్యాదు అందినట్లు సమాచారం. మంత్రి హరీశ్‌రావు ద్వారా సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో ఆరా తీసినట్లు వినికిడి. ఈ క్రమంలో అవసరమైతే కఠిన నిర్ణయం తీసుకుంటామనే హెచ్చరికలు పంపాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అసమ్మతి నాయకులను బుజ్జగించడం చేస్తూనే పార్టీ గీత దాటే ఒకరిద్దరు నాయకులపై వేటు వేసేలా అధిష్టానం ముందుకు సాగుతున్నట్లు పార్టీకి చెందిన సీనియర్‌ నేతల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement