భూపాలపల్లి అర్బన్: సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొంది, మంగళవారం భూపాలపల్లి సీనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తాడూరు మహతి వైష్ణవిని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కునూరు సురేష్ కుమార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను నూతన సీనియర్ సివిల్ జడ్జికి పరిచయం చేశారు. అనంతరం భూపాలపల్లి కోర్టుల వివరాలు, న్యాయవాదుల వివరాలను తెలియజేస్తూ బార్, బెంచ్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు బార్ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కేసుల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆకుల రాములు, న్యాయవాదులు ఇందారపు శివకుమార్, అకినపల్లి రవికుమార్, నాగరాజు, గార్లపాటి ప్రియాంక, కనుకుంట్ల కవిత, మచ్చ వసంత, రజనీకాంత్, అజయ్, రాజు పాల్గొన్నారు.
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నది వరద ప్రవాహం పెరిగి మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి మేడిగడ్డకు చేరుతోంది. మంగళవారం మేడిగడ్డ వద్ద 1,44,470 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలిరావడంతో మొత్తం గేట్లు ఎత్తి నీటి ని దిగువకు తరలిస్తున్నారు. రాత్రి వరకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.
ఉపాధి అవకాశాలకు
స్క్రీనింగ్ క్యాంపు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ఉపాధి కార్యాలయం, యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు, కనీసం 10వ తరగతికిపైగా చదివి శారీరక వైకల్యం, వినికిడి లోపం, స్వల్ప చూపులోపం ఉన్నవారు అర్హులని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే ఈ శిబిరానికి విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఫోన్ నంబర్లు 73306 37711, 92814 08587 సంప్రదించాలని తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ బీసీ మహిళలకు ఉపాధి కల్పించడానికి ఇంటింటా అటోమేటిక్ ఇందిరమ్మ కుట్టు మిషన్లు నూరు శాతం సబ్సిడీతో అందించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవ్సరాలనుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన నిరుద్యోగ మహిళలు, పేదలు, వితంతు, ఒంటరి, దివ్యాంగులు, అనాథ మహిళలకు టైలరింగ్ ట్రెయినింగ్ సర్టిఫికేట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డుతోపాటు కనీస అక్షరాస్యత 5వ తరగతి పాసైన వారు వెబ్‌సైట్ http://tgobmms.cgg. gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని కుల, ఆదాయ, నివాసం, ఆధార్, రేషన్ కార్డు, విద్యా అర్హతలు, టైలరింగ్ శిక్షణ, అనుభవం తదితర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గ్రామీణులు ఎంపీడీఓ కార్యలయం, పట్టణ వాసులు మున్సిపల్ కమిషనర్‌కు సెప్టెంబర్ 15లోపు దరఖాస్తులు అందించాలని సూచించారు.
ఇద్దరు సీఐల బదిలీ
భూపాలపల్లి: జిల్లాలోని ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీజోన్ –1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) సీఐగా పని చేస్తున్న చెన్నూరి శ్రీనివాస్‌ను భూపాలపల్లి సీఐగా, వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎస్‌బీ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న యడ్లపల్లి సతీష్‌ను చిట్యాల సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రస్తుతం భూపాలపల్లి సీఐగా పని చేస్తున్న డి.నరేష్‌కుమార్ త్వరలోనే వరంగల్ ఏసీబీకి వెళ్లనున్నట్లు సమాచారం. అలాగే చిట్యాల సీఐగా పని చేస్తున్న డి.మల్లేష్‌ను మల్టీజోన్ –1 ఐజీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీఐలు శ్రీనివాస్, సతీష్


