● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
ఏటూరునాగారం: గిరిజన దర్బార్‌లో అర్జీదారులు సమర్పించిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్‌ను నిర్వహించారు. పలు సమస్యలపై 27 మంది నుంచి పీఓ వినతులను స్వీకరించారు. ఈ వినతులను ఆయా సెక్టార్ అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఏటూరునాగారం ఆర్‌ఐటీ కళాశాలలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని ఆకులవారిఘణపురానికి చెందిన నాగేంద్ర పీఓను కోరారు. జయశంకర్ భూపాలపల్లి మండలం గణపురంకు చెందిన గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు ఏదైనా ఉపాధి కల్పించాలని వేడుకున్నారు.
తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన పలువురు గిరిజన మహిళలు మంగపేట మండలంలోని స్కూల్ యూనిఫాంలు కుట్టేందుకు పని ఇప్పించాలని అధికారులను కోరారు. ఇలా వివిధ సమస్యలపై పీఓకు బాధితులు సమస్యలు వివరించి పరిష్కరించాలని వేడుకున్నారు.


