ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో మొత్తం 71 దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటిని తగిన చర్యల కోసం సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి అర్జీని బాధ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు.


