భూపాలపల్లి అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ వ్యవసాయ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులు, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక శాస్త్రవేత్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ నీటి అవసరమయ్యే పంటల విత్తనా లు, ఎరువులు అందుబాటులో ఉంచడంతోపాటు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందించాలన్నారు. ప్రతీ రోజు పంటల సాగు పురోగతి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇరిగేషన్ వనరుల్లోని నీటి ని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని, పంటలకు విడుదల చేయొద్దని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, కాల్వల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
హనుమాన్‌నగర్‌కు విద్యుత్ వెలుగులు
మహాముత్తారం మండలం బోర్లగూడెం శివారు హనుమాన్‌నగర్ గిరిజన గ్రామానికి 12 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కలెక్టర్ రాహుల్ శర్మ చొరవతో అటవీ హక్కుల చట్టం ప్రకారం అవసరమైన అనుమతులు లభించడంతో విద్యుత్ లైన్ల ఏర్పాటు పూర్తయింది. మరో రెండు రోజుల్లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కూడా పూర్తికానుంది. విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి జ్ఞాపిక అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులు, అలాగే చట్టపరమైన ప్రక్రియలో సహకరించిన నల్సార్ న్యాయ పట్టభద్రుడు కొర్ర ఆనంద్ నాయక్ సేవలను అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన అధికారి తిరుపతి, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక శాస్త్రవేత్త డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, ఏడీఏలు రమేష్, శ్రీపాల్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్‌ఓ వసంతకుమారి, భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
వ్యవసాయ, ఉద్యానశాఖ
అధికారులతో సమీక్ష


