కోటగుళ్లలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగ రాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచే గణపేశ్వరుడికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట

రైతు ఆత్మహత్యాయత్నం

రేగొండ: భూవివాదంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ రైతు మండల కేంద్రంలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట సోమవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన అన్న కొమురయ్య అనే వ్యక్తి గతంలో అదే గ్రామానికి చెందిన మల్లారెడ్డికి భూమి విక్రయించాడు. కాగా కొన్ని సంవత్సరాల తర్వాత మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన సూర రవీందర్‌కు మల్లారెడ్డి అదే భూమిని విక్రయించాడు. దీంతో రవీందర్‌ భూమిని సాగు చేసుకునే క్రమంలో కొమురయ్య వెళ్లి నా భూమి అంటూ వారం క్రితం హద్దు రాళ్లను తీసేశాడు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా భూసమస్యలను కోర్టులో చూసుకోవాలని పోలీసులు తెలిపారు. కాగా సోమవారం మరోసారి కొమురయ్య హద్దు రాళ్లను తొలగిస్తుండగా రవీందర్‌ 100కు డయల్‌ చేశాడు. దీంతో పోలీసులు వెళ్లి లీగల్‌గా పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా సాయంత్రం కొమురయ్య పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తనకు న్యాయం చేయాలని కోరుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాణ స్వీకారం

కాళేశ్వరం: దేవాదాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఈఓ మహేష్‌, చైర్మన్‌ మోహన్‌శర్మల ఆధ్వర్యంలో ఓదెల కుమారస్వామి సోమవారం ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఇప్పటికే ధర్మకర్త మండలి కొలువుదీరిన విషయం తెలిసిందే. అనివార్యకారణాలతో కుమారస్వామి ప్రమాణస్వీకారం ఆలస్యమైందని తెలిసింది. వారి వెంట ధర్మకర్తలు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ నాగరాజు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా నూతన లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ (ఎల్డీఎం)గా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు సోమవారం కలెక్టర్‌ రాహుల్‌శర్మను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయం, స్వయం ఉపాధి, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారాలకు రుణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో బ్యాంకింగ్‌ సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

జీఎం కార్యాలయం ఎదుట ధర్నా

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని సింగరేణి టీటు క్వార్టర్స్‌ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమయ పాలన లేకుండా తాగునీటి సరఫరా చేస్తున్నారని, వారానికి రెండు రోజులు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్లు మహిళలు ఆరోపించారు. అర్థరాత్రి సమయంలో సైతం నీటిని ఇస్తున్నట్లు మండిపడ్డారు. రాత్రి షిప్టులో భర్తలు విధులు వెళ్లగా మహిళలుగా భయందోళనతోనే నీటిని పట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ రోజు ఉదయం సమయంలో నీటి సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జీఎంను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement