మల్హర్(కాటారం): ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరమని టీఆర్‌వీకే శాస్త్రవేత్త, కోఆర్టినేటర్ డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27 తేదీ నుంచి ఈనెల 29 తేదీ వరకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాటారం రైతు వేదికలో ‘పప్పుధాన్యాలు, కూరగాయల విత్తన మేళా’ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటి కొరత ఏర్పడి పంటల ఎదుగుదల మందగించి, దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. రైతులు నీటి లభ్యతకు తగినట్లుగా పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. మూడు రోజుల మేళాలో రైతులకు పప్పుధాన్యాలు, కూరగాయల విత్తనాలను సులభంగా పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 5 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాటారం ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
టీఆర్‌వీకే శాస్త్రవేత్త మదన్‌మోహన్‌రెడ్డి


