పెట్రోల్‌, డీజిల్‌.. నో స్టాక్‌ | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌.. నో స్టాక్‌

Apr 28 2026 8:17 AM | Updated on Apr 28 2026 8:17 AM

పెట్రోల్‌, డీజిల్‌.. నో స్టాక్‌ పోటెత్తిన వాహనదారులు

రేగొండ/చిట్యాల/మొగుళ్లపల్లి: రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. పెట్రోల్‌, డీజీల్‌ కొరత ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు టిన్నులతో బంకుల వద్ద క్యూలైన్లు కట్టారు. దీంతో సాయంత్రం వరకు ఆయా బంకుల ముందు తాళ్లు కట్టి, నోస్టాక్‌ బోర్డు పెట్టి బారికేడ్లు పెట్టారు. చిట్యాల మండలంలోని చిట్యాల, చల్లగరిగ, జూకల్‌, కొత్తపేట గ్రామాలలోని పెట్రోల్‌ బంక్‌లలో డీజిల్‌, పెట్రోల్‌ లేక వాహనాదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాహనాదారులు బంకుల వద్దకు రాగానే నో స్టాక్‌ బోర్డు పెట్టడంతో వాహనదారులు కంగుతిన్నారు. మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని పెట్రోల్‌ బంకుల వద్ద డీజిల్‌ కోసం జనాలు బారులుదీరారు. డీజిల్‌ కోసం పెద్దఎత్తున క్యాన్లు పట్టుకొని బంకుల వద్ద భారీ క్యూ లైన్‌లో నిలబడ్డారు.

ఇబ్బందుల్లో వాహనదారులు

జిల్లావ్యాప్తంగా ఇంధన కొరత

భూపాలపల్లి: జిల్లావ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్‌, డీజిల్‌ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 43 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. బంకుల్లో సోమవారం ఉదయం నుంచే పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. కొరత విషయం తెలుసుకున్న వాహనదారులు సాయంత్రం పలు పెట్రోల్‌ బంకుల వద్ద బారులుదీరారు. దీంతో ఆయా బంకుల్లో సైతం పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఖాళీ అయ్యాయి. యుద్ధం కారణంగా కొరత ఏర్పడిందని తెలుస్తోంది. పెట్రోల్‌ బంకుల యజమానులు ముందస్తుగా ఇండెంట్‌ పంపినప్పటికీ చమురు కంపెనీల నుంచి ఇంధనం రావడానికి రెండు, మూడు రోజులు పడుతుందని ఓ పెట్రోల్‌ బంక్‌ యజమాని తెలిపారు. సాధారణంగా నాలుగు రోజుల పాటు విక్రయించే స్టాక్‌ ఒక్కరోజే అయిపోయిందని సదరు పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు జిల్లాలోని ఒక్క బంకులో కూడా పెట్రోల్‌, డీజిల్‌ లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement