జూన్ 12నుంచి..
ప్రభుత్వ పాఠశాలల సంఖ్య
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన డిపోకు చేరుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన పుస్తకాలు అందజేయనున్నారు. ఈ మేరకు 1.48లక్షల పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి జూన్ మాసంలో బడిబాట కార్యక్రమం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలాల వారీగా పంపిణీ..
జిల్లావ్యాప్తంగా 12 మండలాలు ఉండగా మండలాల పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను జిల్లా డిపో నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలిస్తారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పాఠశాలలకు పంపించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. 1,48,880 పుస్తకాలు అవసరం ఉండగా 90,320 పుస్తకాలు జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన పుస్తకాల డిపోకు చేరుకోగా మండలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పార్ట్–2లో 42వేల పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. అక్టోబర్ మాసం వరకు మిగితా పుస్తకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
నోట్ పుస్తకాలు సైతం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారికి ప్రభుత్వం ఉచితంగా నోట్ పుస్తకాలు అందిస్తుంది. ప్రతీ సబ్జెక్ట్‌కు ఒక్క నోట్స్ చొప్పున అన్ని సబ్జెక్ట్‌లకు అందించనున్నారు. ఈ నోట్ పుస్తకాలు కార్గో ద్వారా విద్యార్థుల సంఖ్య అధారంగా పాఠశాలకు పంపిస్తారు. 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందించనున్నారు.
జిల్లాకు ఇప్పటికే 60శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మిగితా పుస్తకాలు కూడా ఈ వారం రోజుల్లో రానున్నాయి. వచ్చిన పుస్తకాలను భద్రపరుస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముందస్తుగానే సరఫరా చేస్తుంది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పంపిస్తాం.
– బానోత్ సమ్మయ్య, పుస్తకాల డిపో మేనేజర్
●
జూన్ 12వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్న ప్రతీ విద్యార్థికి పుస్తకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లోనే పూర్తిస్థాయిలో సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు అందజేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లాకు వందశాతం పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించే అవకాశం ఉంది.
జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 69
ప్రాథమికోన్నత పాఠశాలలు 44
ప్రాథమిక పాఠశాలలు 319
విద్యార్థుల సంఖ్య 24వేలు
జిల్లాకు చేరిన 60 శాతం పుస్తకాలు
ప్రభుత్వ పాఠశాలల్లో
24వేల మంది విద్యార్థులు


