ఉచిత వేసవి క్రీడా శిబిరం | - | Sakshi
Sakshi News home page

ఉచిత వేసవి క్రీడా శిబిరం

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియా పరిధిలో పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్‌ మేనేజర్‌ శ్యాం సుందర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 సమ్మర్‌ క్యాంపులో భాగంగా 18 ఏళ్ల లోపు బాలబాలికలకు ఈ శిబిరం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ శిబిరం ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు స్థానిక కృష్ణ కాలనీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో ప్రారంభమవుతుందని తెలిపారు. శిక్షణ శిబిరం ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌ వంటి క్రీడల్లో నిపుణులైన శిక్షకుల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రతీ క్రీడలో 20 నుంచి 25 మంది వరకు ఎంపిక చేసి మొత్తం 25 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఆసక్తి గల ఉద్యోగులు తమ పిల్లల పేర్లను ఈ నెల 28 సాయంత్రం 5 గంటలలోపు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలోని సీఈఆర్‌ క్లబ్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు.

మరణంలోనూ మానవత్వం

మొగుళ్లపల్లి: మండలంలోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన పసరగొండ శ్రీధర్‌ హైదరాబాద్‌లో నివాసముంటూ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన కుటుంబసభ్యులు శనివారం నేత్రదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ భార్య స్వప్న, కుమారుడు బాలరాజు పటేల్‌, తల్లి సరలక్ష్మి తీసుకున్న నిర్ణయంతో ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ సిబ్బంది నేత్రాలను సేకరించారు. మరణానంతరం కూడా మరొకరికి చూపునివ్వడం గొప్ప విషయమని గ్రామస్తులు ఈ కుటుంబాన్ని అభినందించారు.

28న బహిరంగ వేలం

రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన మడ్తపల్లి గ్రామంలోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగ వేలం ఈనెల 28న మంగళవారం నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.

30న కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గ సమావేశం

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు(పాలకవర్గం) మొదటి సమావేశాన్ని ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్‌ అవధాని మోహన్‌శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.

రామప్పలో దూరదర్శన్‌

డైరెక్టర్‌ జనరల్‌ ఇంజనీర్‌

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం దూరదర్శన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఇంజనీర్‌ (డీడీజీఈ ఢిల్లీ) అభిషేక్‌ అగర్వాల్‌ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్‌ శర్మ, ఉమాశంకర్‌ వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్‌ శాలువాతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట హైదరాబాద్‌ దూరదర్శన్‌ డైరెక్టర్‌ వెంకటరమణ, టూరిజం అధికారులు ఉన్నారు.

దూరవిద్య డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య(సీడీఓఈ/ఎస్‌డిఎల్‌సీఈ) డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ (2023–24 బ్యాచ్‌) పరీక్షలు మే 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొపెసర్‌ కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పద్మజ తెలిపారు. మే 7, 11, 13, 15, 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement