ఎక్స్‌పైరీ అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌పైరీ అమ్మకాలు

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

ఎక్స్‌పైరీ అమ్మకాలు కేసులు నమోదు చేస్తాం..

అధికారుల తనిఖీలేవి..

జిల్లాకేంద్రంలో దుకాణాదారుల ఇష్టారాజ్యం

భూపాలపల్లి అర్బన్‌: ప్రజారోగ్యం గాలికి వదిలేసి, కాసులే పరమావధిగా కొందరు వ్యాపారులు బరితెగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కాలంచెల్లిన ఆహార పదార్థాలు, పానీయాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలో ఎక్స్‌పైరీ తేదీ ముగిసి రెండు నెలలవుతున్నా దానిని వినియోగదారులకు అంటగడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.

చూసి కొనాల్సిందేనా..

సాధారణంగా ఏదైనా ఆహార వస్తువు కొనే ముందు వినియోగదారులు దానిపై ఉన్న తయారీ, గడువు తేదీలను గమనించాలి. నమ్మకంతో కొనే వారిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు జిల్లాలో పాత స్టాక్‌ను విక్రయిస్తున్నారు. తాజాగా జిల్లాకేంద్రంలోని జయశంకర్‌ సెంటర్‌లోని ఓ కిరాణం దుకాణంలో లభ్యమైన బిస్కెట్‌ ప్యాకెట్‌లకు 2026 జనవరి వరకు మాత్రమే గడువు ఉంది. పలు బిస్కెట్‌ ప్యాకెట్లు, కూల్‌డ్రింక్స్‌ బాటిళ్ల గడువు ముగిసిపోయినవి దుకాణంలో ఉన్నాయి. ఏప్రిల్‌ నెల వచ్చినా ఇంకా పాత వస్తువులను దుకాణాలలో ఉంచి విక్రయించడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిస్తుంది. మరో సూపర్‌మార్కెట్‌లో 2025 అక్టోబర్‌ 28వ తేదీతో గడువు ముగిసిన బ్రూ కాఫీ ఫౌడర్‌ దర్శనమిస్తుంది. గడువు ముగిసిన పదార్థాలు, పానియాలు సేవించడంతో ఫుడ్‌ పాయిజన్‌, వాంతులు, విరేచనాలు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో చిన్నారులు యువత కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇంత జరుగుతున్నా సంబంధింత ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు

జిల్లాకేంద్రంలో కిరాణా దుకాణాలు, సూపర్‌మార్కెట్‌లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కూల్‌ డ్రింక్‌ విక్రయాలు చేపడుతున్నారని వరల్డ్‌ కన్సుమర్‌ రైట్‌ సభ్యులు సోమవారం కలెక్టర్‌ రాహుల్‌శర్మకు ఫిర్యాదు చేశారు. విచ్చల విడిగా గడువు ముగిసిన వస్తువులను అమ్మకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గడువు ముగిసిన బిస్కెట్‌ ప్యాకెట్‌లు, కూల్‌డ్రింక్స్‌ బాటిళ్ల ఫొటోలను ఆధారాలతో కలెక్టర్‌కు అందించారు.

అధికారులు స్పందించేనా..

ఎక్స్‌పైరీ ముగిసిన వస్తువులను అమ్ముతున్నా.. ఫిర్యాదులు వస్తేనే అధికారులు స్పందిస్తారా లేదా విధి నిర్వహణను నెరవేరుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ, తనిఖీ అధి కారులు ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

గడువు తేదీ ముగిసిన వస్తువులను వినియోగదారులకు అమ్మడం నేరం. తేది ముగిసిన వస్తువులు అమ్మకాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పలు దుకాణదారులకు నోటీసులు జారీ చేశాం. మరోసారి జరిగితే చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు గమనించి ఫిర్యాదు చేయాలి.

– జి.వరుణ్‌రెడ్డి, జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కిరాణా షాపులు, హోటళ్లు, కూల్‌ డ్రింక్‌ ఏజెన్సీలలో నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు కార్యాలయానికే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాఽధికారులు స్పందించి జిల్లాకేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement