● అకాల వర్షంతో రైతులకు నష్టం
కాళేశ్వరం/చిట్యాల: మంగళవారం తెల్లవారుజామున మహదేవపూర్, చిట్యాల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం జరిగింది. కాళేశ్వరం, అన్నారం, పలుగుల, చండ్రుపల్లి గ్రామాల్లో చేతికొచ్చిన పంటలు నేలమట్టమయ్యాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. కొన్ని చోట్ల మిర్చిపై పట్టాలు కప్పివేయడంతో వర్షపు నీరు నిలిచింది. చిట్యాల మండలం గుంటురుపల్లి, గోపాలపూర్‌తో పాటు పలు గ్రామాల శివారులలో మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. వరి పంట కోతకు వచ్చే సమయంలో ఈదురుగాలులు వీచి పంట నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుంటురుపల్లి శివారులో వీరవేని గణేష్ ఏడెకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా.. నాలుగెకరాల పంట నేలమట్టమైంది. గోపాలపూర్‌లో బోగం నర్సయ్య మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. అధికారులు పంటలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.


