‘వంటావార్పు’ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘వంటావార్పు’ను విజయవంతం చేయాలి

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

‘వంటావార్పు’ను విజయవంతం చేయాలి వార్షిక లక్ష్యానికి దూరంగా గనులు టీపీసీసీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా రమేశ్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో బంగారు పతకం

మొగుళ్లపల్లి: భూపాలపల్లి సర్కిల్‌ ఆఫీస్‌ ఎదుట నేడు (గురువారం) నిర్వహించనున్న వంటావార్పు కార్యక్రమాన్ని విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికులు అన్‌మ్యాన్డ్‌, స్పాట్‌ బిల్డర్స్‌, పీస్‌ రేటు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని టీవీఏఈ విద్యుత్‌ జేఏసీ భూపాలపల్లి డివిజన్‌ జాయింట్‌ సెక్రటరీ వేముల కిరణ్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్‌ కార్మికులను విద్యార్హతను బట్టి కన్వర్షన్‌ చేయాలని, అన్‌మ్యాన్డ్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఏప్రిల్‌ 8 నుంచి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.

భూపాలపల్లి అర్బన్‌: గత ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాకు 46.54 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 74 శాతం బొగ్గు ఉత్పత్తిని వెలికితీశారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను ఏరియా జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 55 వేల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. ఏరియాకు మొత్తం 46.54 లక్ష టన్నుల లక్ష్యానికి 34.22 లక్ష టన్నులు మాత్రమే సాధించి 74 శాతంలో నిలిచామన్నారు. కేటీకే–1 గని 71 శాతం, కేటీకే–5, కేటీకే–6 గనులు 49 శాతం చొప్పున, కేటీకే–8 గని 44 శాతం సాధించాయి. కేటీకే ఓసీ–2 గని 97 శాతం, ఓసీ–3 గని 69 శాతం సాధించాయన్నారు. గతేడాదిలో ఏరియాకు రూ.703 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. ఓపెన్‌ కాస్ట్‌–2, 3 గనుల్లో ఉత్పత్తి పూర్తి స్థాయిలో రాకపోవడంతో రూ.149 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్దేశించిన 46 లక్షల టన్నుల లక్ష్యాలను చేరుకోవాలంటే కార్మికులు ఉద్యోగులు సమష్టిగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, ఐఈడీ జ్యోతి, డీజీఎం ఫైనాన్స్‌ రాజేశ్వరరావు, పర్సనల్‌ మేనేజర్‌ శ్యాంప్రసాద్‌, డీవైపీఎం శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి రూరల్‌: టీపీసీసీ సాంస్కృతిక సేన జిల్లా కమిటీని జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నియామక పత్రం అందించారు. అధ్యక్షుడిగా గడ్డం రమేశ్‌ చంద్ర, ప్రధాన కార్యదర్శి రజినికాంత్‌, ఉపాధ్యక్షుడు దేవేందర్‌, కోశాధికారి ప్రతాప్‌, కార్యదర్శులుగా నరేశ్‌, రాజ్‌నాయక్‌, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

భూపాలపల్లి అర్బన్‌: జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో భారత్‌ కుకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గత నెలలో జరిగిన కోల్‌ ఇండియా స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1వ గనికి చెందిన పోగుల శంకరయ్య విశిష్ట ప్రతిభ కనబరిచారు. 45 ఏళ్ల వయో విభాగం డబుల్స్‌లో పాల్గొని మొదటి స్థానం సాధించి బంగారు పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి శాలువా, బహుమతులతో శంకరయ్యను ఘనంగా సన్మానించారు. కోల్‌ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి సంస్థకు ప్రథమ స్థానం తీసుకురావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, ఏజీఎం జ్యోతి, డీజీఎం రాజేశ్వర్‌, పర్సనల్‌ మేనేజర్‌ సల్ల శ్యామ్‌సుందర్‌, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ శ్రవణ్‌కుమార్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ పర్స శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement