భూపాలపల్లి అర్బన్: మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సరస్వతి అంత్య పుష్కరాల పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఘాట్ల అభివృద్ధి, రహదారుల మరమ్మతు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ, దేవాదాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు కేటాయించిన పనులను సమన్వయంతో నిర్వహించి, నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఇరిగేషన్, పీఆర్, విద్యుత్, మిషన్ భగీరథ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


