‘కాళేశ్వరం’ ట్రస్టుబోర్డు నియామకం | - | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’ ట్రస్టుబోర్డు నియామకం

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

‘కాళేశ్వరం’ ట్రస్టుబోర్డు నియామకం

కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు నియామకానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌ రెండేళ్ల కాలపరిమితితో ఉత్తర్వులు జారీచేశారు. 12 మంది సభ్యులతో పాలకవర్గం ఏర్పడనుంది. సభ్యులుగా దొడ్ల అశోక్‌, కుంభం పద్మ, అడ్డూరి శ్రీధర్‌రావు, బీసుల నర్సయ్య, మంచినీళ్ల దుర్గయ్య, గంధెసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, అవధాని మోహన్‌శర్మ, జలవంచ సీతారాం, కె.సత్తయ్య, డి.శ్యాంసుందర్‌ నియమితులయ్యారు. ఎక్స్‌అఫీషియోగా ఉప ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మను నియమించారు. చైర్మన్‌గా అవధాని మోహన్‌ శర్మ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.

సభ్యుల కుదింపు..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో 15 మంది సభ్యులతో పాలకవర్గం ఉండగా, ప్రస్తుతం 12 మందికే పరిమితం చేయడంతో కొంతమంది ఆశావహులు నిరాశకు గురయ్యారు. గతేడాది నవంబర్‌ 15న నోటిఫికేషన్‌ జారీ అయినప్పటికీ, పలుమార్లు వాయిదాల తర్వాత చివరకు నియామక ఉత్తర్వులు వెలువడటంతో ఎంపికై న వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. 27 నెలలుగా పాలకవర్గం లేకపోవడం గమనార్హం.

కాళేశ్వరంపై మంత్రి చూపు..

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేసి కాళేశ్వరం రూపురేఖలు మార్చేందుకు బృహత్తర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కాళేశ్వరం పర్యటన సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు జరిగే ప్రాంతాలకు రూ.500కోట్ల నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఆ నిధులతో పలు అభివృద్ధి జరుగనుంది.

ట్రస్టుబోర్డుకు రెండు పుష్కరాలు..

ట్రస్ట్‌ బోర్డు ముందున్న ముఖ్య బాధ్యతల్లో ఈ ఏడాది మే 21 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు, వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 6 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ ప్రధానంగా ఉన్నాయి. దేవస్థానం అభివృద్ధికి ఈ కొత్త పాలకవర్గం కీలకంగా మారనుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement