అంతులేని అవినీతి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కలెక్టరేట్‌లో రూ.60వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ ఎ.వెంకట్‌రెడ్డిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఓ వైపు భూ నిర్వాసితులు, మరోవైపు కొందరు రైస్‌మిల్లర్లు తమగోడును వెళ్లబోసుకుంటున్నారు. దామెర, ఊరుగొండ గ్రామాలకు చెందిన గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధిత రైతులు ఏకంగా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ‘మా ఉసురు తాకింది’అంటూ టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎంఆర్ వేధింపులకు గురైన రైస్‌మిల్లర్లు కొందరు సీఎస్ కార్యాలయంలో వెంకట్‌రెడ్డిపై ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది.
ఆదినుంచి వివాదాస్పదుడే...
రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఎ.వెంకట్‌రెడ్డి ఆదినుంచి వివాదాస్పదుడే. ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వంలోని తన సామాజిక నేపథ్యం ఉన్న నేతల పేర్లు చెబుతూ ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నం చేసేవారన్న ఆరోపణలున్నాయి. జనగామ ఆర్డీఓగా, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. భువనగిరి – వరంగల్ 563 జాతీయ రహదారి భూసేకరణలో ఈయన చేయని అక్రమాలు లేవన్న ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరాయి. జనగామ ఆర్డీఓగా పని చేసిన సమయంలో అప్పుడున్న నియోజకవర్గ కీలక నేత, ఆయన బావమరుదులు, బంధువుల ఒత్తిళ్లకు తలొగ్గి అసైన్డ్, ప్రభుత్వ భూములను పట్టాభూములుగా చిత్రీకరించి రూ.లక్షల్లో పరిహారం చెల్లించారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. సూర్యాపేటలో డిఫాల్టర్లయిన రైసుమిల్లర్ల నుంచి భారీగా వసూళ్లు చేసి సీఎంఆర్ కింద వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కట్టబెట్టినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడా విచారణ ఎదుర్కొన్నారు.
అక్రమార్కులకు సీఎంఆర్..
ఉదంతాలు అనేకం..
● హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో సీఎంఆర్ కేటాయింపులకు తీసుకునే నజరానాలు రెండింతలు పెరిగాయని కొందరు రైస్‌మిల్లర్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయంలో చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
● ఒక్కో సీజన్‌కు ఒక్కో రైసుమిల్లు నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు.
● ఇన్‌టైంలో సీఎంఆర్ ఇచ్చిన రైసుమిల్లర్లను పక్కన పెట్టి.. డిఫాల్టర్లయిన వారు ముడుపులివ్వగానే వారికి పెద్ద మొత్తంలో ధాన్యం కేటాయించారు.
● కమలాపూర్‌లో రెండు రైస్‌మిల్లులున్న ఓ వ్యాపారి సుమారు రూ.16 కోట్ల వరకు బకాయి ఉన్నా తిరిగి ఈ సీజన్‌లో భారీగా ధాన్యం కేటాయింపులకు ఆదేశాలిచ్చిన వెంకట్‌రెడ్డి.. ‘కన్నయ్య’కు అన్నయ్యలా మారాడని రైస్‌మిల్లర్లు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
● సీతంపేట శివారులోని ఓ రైసుమిల్లర్‌కు రూ.15 కోట్ల మేరకు ధాన్యం కేటాయించగా.. ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు తిరిగి బియ్యం చెల్లించలేదని చెబుతున్నారు.
● ఇలా పలువురు రైస్‌మిల్లర్లకు ఇష్టారాజ్యంగా సీఎంఆర్ కేటాయించి.. ఉన్నతాధికారులకు ప్రభుత్వంలోని కొందరు కీలక ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి బెదిరింపు ధోరణిని కూడా ప్రదర్శించే వారన్న పేరు వెంకట్‌రెడ్డికి ఉంది.
● పౌరసరఫరాలశాఖలోని ఓ కింది స్థాయి ఉద్యోగి సీఎంఆర్ లావాదేవీలలో కీలకంగా వ్యవహరించగా.. ఇద్దరు ఉన్నతాధికారులు సైతం కొమ్ముకాశారన్న విమర్శలున్నాయి.
ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు...?
అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్, సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ గౌసుద్దీన్‌లకు ఏసీబీ అధికారులు శనివారం హనుమకొండ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు విచారణ జరిపిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి క్షమా దేశ్‌పాండే ముగ్గురికి ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వగా, ఖమ్మం జిల్లా జైలుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
హనుమకొండ అడిషనల్ కలెక్టర్
వెంకట్‌రెడ్డిపై ఫిర్యాదుల పరంపర
తవ్విన కొద్దీ అవినీతి, అక్రమాలు..
సీఎంఆర్‌లో అవకతవకలు
కలెక్టరేట్ ఎదుట టపాసులు
కాల్చి రైతుల సంబురాలు
రెండో రోజు నాగోల్,
హనుమకొండలో సోదాలు
రూ.30.30లక్షల నగదు
స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
భూసేకరణ, సీఎంఆర్ రికార్డులపైనా విచారణ
వెంకట్‌రెడ్డి టీమ్‌పై ఏసీబీ ఆరా..
ఏసీబీ అధికారులు శుక్రవారం ఘటనా స్థలంలోనే రసాయన పరీక్షలు చేసి, లంచం డబ్బు వెంకట్‌రెడ్డి చేతిలో ఉండటాన్ని ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కలెక్టరేట్‌లో తనిఖీలు చేసిన ఏసీబీ టీమ్ పలు ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కార్యాలయ గదిలోని డాక్యుమెంట్లు, కంప్యూటర్‌లు, ఫైళ్లను స్కాన్ చేశారు. ఈ రైడ్స్‌లో అదనపు ఆస్తులు, మరిన్ని అవినీతి ఆధారాలు దొరికినట్లు సమాచారం. సీఎంఆర్, భూసేకరణల్లో భారీ అక్రమాలు జరిగాయన్న నిర్ధారణకు వచ్చిన ఏసీబీ.. ఈ రెండు అంశాల్లో అతనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రెవెన్యూ, సివిల్‌సప్లయీస్ అధికారులు, సిబ్బంది వివరాలపై ఆరా తీస్తోంది. హనుమకొండ, నాగోల్‌లోని ఆయన ఇళ్లలో తనిఖీలు చేసి రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అంతులేని అవినీతి..!


