సోషల్ మీడియా ప్రచార వేదిక
కాళేశ్వరం: జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పలు వ్యూహాలు రచిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను తమ ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తున్నారు. తాము గెలిస్తే ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించేందుకు అదే వేదిక ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలను విరివిగా అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను ఉపయోగించి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు ముందు నుంచే ప్రత్యేక వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర సోషల్ మీడియాలో వారి మద్దతుదారులు, గ్రామస్తుల సెల్‌ఫోన్ నంబర్లతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో చేపట్టే పనులపై మినీ మేనిఫెస్టోలు, నేతల సందేశాలు, ఇతర హామీలు, రోజువారీ కార్యక్రమాలను పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యర్థులు పెట్టే పోస్టులకు భిన్నంగా, ఆసక్తికరంగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థి అనుచరగణం, కుటుంబ సభ్యులు కూడా వీటినే ఉపయోగించుకుంటూ మద్దతు కూడగడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉండటంతో చాలా మంది అభ్యర్థులు వీటినే ప్రధాన ప్రచార అస్త్రాలుగా వినియోగిస్తున్నారు.
నిఘా తీవ్రం..
జిల్లాలో 12 మండలాల్లో 248 పంచాయతీల్లో ఈనెల 11న మొదటి, 14న రెండో, 17న మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారాలు ఊపందుకున్నారు. దీని కోసం యువకులు రాత్రిపగలు శ్రమిస్తున్నారు. అభ్యర్థులకు ఈజీగా ఉండడంతో ఎక్కువ ప్రచారాన్ని సోషల్‌మీడియా వేదికనే నమ్ముకున్నారు. ఎస్‌బీ, ఇంటిలిజెన్స్, పోలీసు నిఘా విభాగాలు ఆయా వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఇతర సోషల్ మీడియాలపై నజర్ వేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద అభ్యర్థులు తక్కువ ఖర్చులతో ఎక్కువ ప్రచారాన్ని ప్రజల వద్దకు చేర్చుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల సరికొత్త ట్రెండ్
సామాజిక మాధ్యమాలే వేదికగా విస్తృతంగా ప్రచారం
జిల్లాలో ఏ పల్లె చూసినా పంచాయతీ ఎన్నికల ఫీవర్


