లక్ష్యం ఏకగ్రీవం..
రెండు విడతల్లో 17 పంచాయతీలు యునానిమస్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి అందరి దృష్టి ఏకగ్రీవ పంచాయతీలపై పడింది. గతంలో కన్నా ఈసారి ఎక్కువగా ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 9వ తేదీన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది కావడంతో ఈలోపు మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవం కావడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. కొన్ని పంచాయతీల్లో ఏకగ్రీవం అయిన వ్యక్తి కూడా సొంత డబ్బులు చెల్లించి అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్తులు తీర్మానాలు చేసుకుంటున్నారు. డబ్బులు చెల్లించే విషయాలు బయటకి పొక్కకుండా కొన్ని గ్రామ పంచాయతీల్లో ఒకటికి మించి నామినేషన్లు దాఖలు చేశారు. మరికొన్ని పంచాయతీల్లో గ్రామాభివృద్ధికి ఒప్పుకున్న డబ్బులు పూర్తిగా ఇవ్వకపోవడంతో ఒకటికి మించి నామినేషన్లు వేశారు. గ్రామాభివృద్ధికి ఇవ్వాల్సిన మొత్తం పూర్తిగా ఇస్తేనే నామినేషన్ ఉపసంహరించుకుంటామని చెబుతున్నట్లు సమాచారం. గ్రామాల్లో ప్రధానంగా దేవాలయాలు, బొడ్రాయి, బోర్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన వారిని ప్రజలు ఏకగ్రీవం చేస్తున్నారు.
8 మండలాల్లో 17 ఏకగ్రీవం
మొదటి, రెండో విడతలోని 8 మండలాల్లోని 167 గ్రామపంచాయతీలకు జరుగనున్న ఎన్నికల్లో 17 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో మరో 8 గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవం కావడానికి నామినేషన్లు వేసిన సభ్యులు ఒప్పుకున్నట్టు సమాచారం. అత్యధికంగా చిట్యాల మండలంలో ఐదు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా కొత్తపల్లి గోరి, రేగొండ, మొగుళ్లపల్లి, టేకుమట్ల, భూపాలపల్లి మండలాల్లో రెండేసి చొప్పున గణపురం, పలిమెల మండలాల్లో ఒక్కో సర్పంచ్ ఏకగ్రీవమయ్యాయి.
ఏకగ్రీవం కోసం సంప్రదింపులు
నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత నుంచే కాటారం, మల్హర్, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవం కోసం సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9వ తేదీ కావడంతో ఈ రెండు రోజుల్లో మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. వీటిలో రెండు, మూడు నామినేషన్లు దాఖలయిన పంచాయతీల్లో ఏకగ్రీవం కోసం చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా అధికారపార్టీ ఏకగ్రీవం కోసం విపరీతంగా కష్టపడుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధం ఉన్న అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉంటే విత్‌డ్రా చేసుకునే విధంగా బుజ్జగింపులు జరుగుతున్నాయి. పెద్ద గ్రామపంచాయతీల్లో మాత్రం ఏకగ్రీవం కోసం ప్రయత్నించినా పోటీలో ఉన్న అభ్యర్థులు ఒప్పుకునే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటి వరకు ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో ఒక్కటి కూడా పెద్ద గ్రామ పంచాయతీ లేకపోవడం గమనార్హం. 2019 పంచాయతీ ఎన్నికల్లో 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గతంలో ఏకగ్రీవం అయి ఈసారి కూడా ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో చిట్యాల మండలం బావుసింగ్‌పల్లి, చైన్‌పాక, రేగొండ మండలం చెంచుపల్లి గ్రామపంచాయతీలు మాత్రమే ఉన్నాయి.
గుడులు, బొడ్రాయి, స్థలాలపై హామీలు
అభివృద్ధి ఎజెండాగానే జిల్లాలో పంచాయతీల ఏకగ్రీవ ప్రక్రియ జరుగుతోంది. ఈ విషయంలో చిట్యాల, గణపురం, రేగొండ, భూపాలపల్లి మండలాల్లోని పంచాయతీల్లో గ్రామస్తులు, గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో అభివృద్ధి ప్రధానంగా ఏకగ్రీవం ప్రక్రియ జరిగింది. వీటితో పాటు మిగిలిన మండలాల్లో ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో అభివృద్ధి పనులపైనే చర్చ జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో గుడులు, గుడి నిర్మాణాలకు స్థలాలు, తాగునీటి సదుపాయం కోసం బోర్లు, గ్రామాల్లో బొడ్రాయి ఏర్పాటు వంటివి ప్రధానంగా చర్చకు వచ్చాయి. గ్రామాల్లో ఏకగ్రీవం అయిన వ్యక్తులు సొంత ఖర్చులతో ఇవన్నీ చేయించిన వారికే మద్దతు ఉంటుందని కొన్ని పంచాయతీల్లో తీర్మానాలు కూడా జరిగాయి.
మూడో విడతలో మరిన్ని అయ్యే అవకాశం
గుడులు, బొడ్రాయి, బోర్ల పనులే ఎజెండా
లక్ష్యం ఏకగ్రీవం..


