పదికి పక్కా ప్రణాళిక
కాటారం: టెన్త్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రభుత్వ పాఠశాలల్లో పక్కా ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే సిలబస్ పూర్తిచేసిన ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో రివిజన్ తరగతులు బోధిస్తూ స్టడీ అవర్స్ సమయంలో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అధిక ఉత్తీర్ణత శాతం సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికతో శ్రమిస్తున్నారు.
జిల్లాలో 67 ప్రభుత్వ హైస్కూల్స్ ఉండగా 1,216 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు 20 మార్కులు ఇంటర్నల్ కాగా, 80 మార్కులకు రాత పరీక్షలు ఉంటాయి. సీసీఈ ప్రశ్నావళి విధానంతో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున వీటిని దృష్టిలో ఉంచుకొని ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.
ముందస్తుగా అవగాహన..
ప్రైవేట్ పాఠశాలల స్థాయిలో ఉదయం, సాయంత్రం అదనంగా ఒక గంట పాటు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఎలా చదవాలి, ఎక్కువ మార్కులు వచ్చేందుకు ఏం చేయాలనే అవగాహన కల్పిస్తున్నారు. రోజుకో పరీక్ష నిర్వహించి బిట్స్ ఎలా రాయాలో ప్రిపేర్ చేయిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు.
స్నాక్స్‌పై సందిగ్ధం..
ప్రభుత్వ పాఠశాలల్లో స్టడీ అవర్స్‌కు హాజరయ్యే తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టడీ అవర్స్ మొదలై వారం దాటినా ఇప్పటివరకు స్నాక్స్ అందజేతపై సందిగ్ధం కొనసాగుతోంది. గతేడాది కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక నిధులు కేటాయించి స్నాక్స్ అందించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
ప్రత్యేక తరగతులు ప్రారంభం
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
పరీక్షలపై విద్యార్థులకు
ముందస్తు అవగాహన
స్నాక్స్ పంపిణీపై సందిగ్ధం
సందేహాలను నివృత్తి చేస్తూ..
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. రోజు వారీగా సబ్జెక్ట్ స్టడీ అవర్స్ నిర్వహిస్తూ విద్యార్థుల సందేహాలను తీరుస్తున్నారు.
– రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రత్యేక ప్రిపరేషన్ చేయిస్తున్నారు..
స్టడీ అవర్స్ మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రిపరేషన్ చేపిస్తున్నారు. పాఠాల్లో వచ్చిన సందేహాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు.
– ఆరెల్లి శ్రీజ, పదో తరగతి విద్యార్థిని,
టేకుమట్ల
పదికి పక్కా ప్రణాళిక
పదికి పక్కా ప్రణాళిక


