రీజినల్ స్థాయి క్రికెట్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్ పీపుల్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపీఎస్) భూపాలపల్లి, రామగుండం–3 ఏరియాల క్రికెట్ రీజినల్ స్థాయి క్రికెట్ పోటీలను శనివారం ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో ప్రతీ ఏడాది మాదిరిగా క్రీడలను నిర్వహించడం ఆనందకరమన్నారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడలు రోజు వారి మన కార్యకలాపాలలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న భూపాలపల్లి జట్టు 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టపోయి 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్జీ–3 జట్టు 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 160 పరుగులు మాత్రమే చేసింది. 24 పరుగుల తేడాతో భూపాలపల్లి ఏరియా జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్‌కుమార్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, బొడ్డు అశోక్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


