సాదుకున్న కొడుకు
తిండి పెడుతలేడు..
నా పేరు అల్లూరు జగదీశ్వర్, అంకుశాపూర్ గ్రామం, టేకుమట్ల మండలం. నాకు పిల్లలు లేకపోవడంతో మా ఊరికి చెందిన రాజేంద్రప్రసాద్‌ను చిన్నతనంలోనే దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివించాను. నా భార్య అనారోగ్యంతో ఇటీవలే చనిపోయింది. నాకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నాను. సాదుకున్న కొడుకు నాకున్న ఎకరం 10 గుంటల భూమిని తన పేరుపై ఎక్కించుకొని హనుమకొండకు వెళ్లాడు. కనీసం తిండి పెట్టే వారు కరువయ్యారు. సాదుకున్న కొడుకు నా బాగోగులు చూసేలా చూడండి అని జగదీశ్వర్ వేడుకున్నాడు.
ప్రజావాణికి
51 దరఖాస్తులు
● ఎక్కువగా భూ సమస్యలు,
పింఛన్ కోసమే..
● బ్యాంకు అధికారుల తీరుపై
కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం
● ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు
భూపాలపల్లి: జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 51 వినతులు వచ్చాయి. అందులో ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్ల మంజూరు దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. పంట రుణం మాఫీ విషయంలో చోటుచేసుకున్న తప్పిదాలు, పంట రుణం డబ్బుల కోసం కల్యాణలక్ష్మి చెక్కును ఆపిన బ్యాంకు అధికారులపై కలెక్టర్ రాహుల్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజావాణికి గైర్హాజరైన జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఏఓను ఆదేశించారు.