ప్రమాద సూచికలు.. హెచ్చరిక బోర్డులు నిల్‌

హెచ్చరిక బోర్డులు లేకుండానే చేస్తున్న ఎన్‌హెచ్‌ పనులు - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి గణపురం మండలం చెల్పూర్‌ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల్లో సంబంధిత కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వ్యక్తమవుతోంది. 8 కిలోమీటర్ల మేరకు రోడ్డు వెడల్పు పనులను చేపడుతున్నారు. ఎక్కడ కూడా హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా పనులు చేస్తున్నారు. దీంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదకరంగా పనులు

రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో సూచక బోర్డులు ఏర్పాటు చేయకుండా ప్రమాదకరంగా పనులు చేపడుతున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా లారీలు, జేసీబీలు, ఇతర వాహనాలతో పనులు చేస్తున్నారు. పక్కన వాహనాలు మళ్లించేందుకు సూచనలు చేసే విధంగా ఎవరిని నియమించడం లేదు. అంతే కాకుండా రోడ్డు ఇరువైపులా మట్టిని తోడి కంకర రాళ్లు రోడ్డు పక్కనే ప్రమాదకరంగా పోశారు. పక్కలకు రేడియం, రెడ్‌ కలర్‌ సూచికలను ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాహదారి వెంట నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఈ క్రమంలో తరుచూ చిన్న చిన్న ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం ఓ కారు అదపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. మూడు రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సును లారీ అదుపు తప్పి ఢీ కొట్టింది.

చోద్యం చూస్తున్న అధికారులు

హెచ్చరిక బోర్డులు లేకుండా పనులు జరుగుతున్నా జాతీయ రాహదారి అభివృద్ధి శాఖ అధికారులు చోద్యం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారిపై ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో

అలసత్వం

ప్రమాదకరంగా డైవర్షన్లు

పట్టించుకోని ఎన్‌హెచ్‌ అధికారులు

Read latest Jayashankar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top