కొనుగోళ్లలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో జాప్యం

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

● అధికారుల నిర్లక్ష్యంతో రైతుల పడిగాపులు

● ఈపీ బుక్కుల నిలిపివేతతో నిలిచిన ధాన్యం ఎగుమతులు

● ఒంటిగంటకు బదులు..

నాలుగు గంటలకు కొనుగోళ్లు

● జనగామ మార్కెట్‌లో వ్యాపారులు వర్సెస్‌ అధికారులు

● కోతల వేళ కొనుగోళ్లపై నిర్లక్ష్యం ఏంటని అన్నదాతల ఆగ్రహం

జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు–అధికారుల మధ్య సమన్వయ లోపం రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మధ్యాహ్నం ఒంటి గంటకే ప్రారంభం కావాల్సిన ధాన్యం కొనుగోళ్లు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చిన రైతులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రస్తుత కోతల సీజన్‌లో కొనుగోళ్లు సజావుగా సాగాల్సిన సమయంలో అధికారుల దూరదృష్టి కొరవడడంతో ఏర్పడిన ఈ పరిస్థితిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈపీ బుక్కుల నిలిపివేతతో సమస్య

మార్కెట్‌లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఎక్స్‌పోర్ట్‌ పర్మిట్‌ (ఈపీ) బుక్‌ తప్పనిసరిగా అవసరం. అయితే కొందరు ఖరీదుదారులు పన్నుల చెల్లింపులో జాప్యం చేస్తున్నారనే కారణంతో అధికారులు ఈపీ బుక్కులను నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించలేకపోతున్నామని వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశా రు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు బకాయిలను చెల్లిస్తున్నామని, ఈపీ బుక్కులు నిలి పివేయడంతో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సమస్య కు నిరసనగా మంగళవారం కొనుగోళ్లు చేపట్టకూడదని ఖరీదుదారులు నిర్ణయించడంతో మ ధ్యాహ్నం ఒంటి గంట దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతుల్లో అసహనం పెరిగింది.

చర్చలతో సద్దుమణిగిన వివాదం

పరిస్థితి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో డీఎంఓ సారంగపాణి, మార్కెట్‌ అధికారుల ఆధ్వర్యంలో ఖరీదుదారులను ఏఎంసీ కార్యాలయానికి పిలిపించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వ్యాపారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈపీ బుక్కులు అందిస్తామని అధి కారులు అంగీకరించడంతో కొనుగోళ్లు తిరిగి ప్రారంభించేందుకు వ్యాపారులు సమ్మతించారు. సాయంత్రం నాలుగు గంటలకు కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మార్కెట్‌ కమిటీ గ్రూపులో సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా ధాన్యం నాణ్యత, ధర(బిడ్డింగ్‌) తదితర ఫార్మాలిటీ పూర్తయ్యేసరికి సాయంత్రం 5 గంటలు దాటిపోయింది. సరుకు అమ్ముకునే సరికి చీకటి పడడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు.

ముందస్తు సమన్వయం ఏదీ?

మార్కెట్‌కు ప్రతిరోజూ సుమారు ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు పైగా ధాన్యం బస్తాలు వస్తున్నాయి. వీటిలో సుమారు 75 శాతం కర్ణాటకకు, మిగిలిన 25 శాతం స్థానిక మిల్లులు, సిద్దిపేట పరిసర ప్రాంతాలకు తరలుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కొనుగోళ్ల సమయంలో గతంలోనూ జాప్యాలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. గత సీజన్‌లో అప్పటి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివరాజ్‌ యాదవ్‌ తన బృందంతో వ్యాపారులు, హమాలీలతో సమన్వయం చేస్తూ కొనుగోళ్లను పర్యవేక్షించేవారని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ కార్యదర్శి లేకపోవడంతో ఇన్‌చార్జ్‌ అధికారిపై పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నాయి. అయితే ఇన్‌చార్జ్‌గా ఉన్న అధికారులు ముందస్తు సమావేశాలు, సమన్వయ చర్యలు తీసుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.

ఇకనైనా అప్రమత్తం కావాలి

ప్రస్తుతం కోతలు ప్రారంభ దశలోనే ఉండగా, రానున్న రోజుల్లో మార్కెట్‌కు ధాన్యం రాక మరింత పెరిగే అవకాశముంది. ప్రైవేటు మార్కెట్‌లో మద్దతు ధర కంటే సుమారు రూ.100 అటూఇటుగా అధిక ధర లభిస్తుండటంతో మెజార్టీ రైతులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ మార్కెట్‌లో కొనుగోళ్లు ఆలస్యమైతే రైతులకు మరింత నష్టం జరిగే ప్రమాదముంది. గతంలో మార్కెట్‌లో కొనుగోళ్ల జాప్యంపై పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి, వ్యాపారులతో సమన్వయం పెంచి, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై డీఎంఓ సారంగపాణి మాట్లాడుతూ.. కొందరు ఖరీదుదారులు పన్నుల చెల్లింపులో జాప్యం చేయడంతో ఈపీ బుక్కులు నిలిపివేశామని, కొనుగోళ్లు ఆలస్యమవుతున్నట్లు గుర్తించి వ్యాపారులను పిలిచి మాట్లాడి ఈపీ బుక్కులు ఇచ్చామని తెలిపారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు కొనుగోళ్లు ప్రారంభమైనట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement