జనగామ: విద్యుత్‌ను అవసరమైనప్పుడే వినియోగించడం, అనవసర వినియోగాన్ని తగ్గించడం ద్వారా విద్యుత్ పొదుపునకు సహకరించాలని ఎన్పీడీసీఎల్ (నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది. విద్యుత్‌ను పొదుపు చేయడం అంటే కరెంటు ఉత్పత్తి చేసినట్లుగానే భావించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో వేసవిలో విద్యుత్ వినియోగం మరింత పెరగవచ్చని పేర్కొంటూ, వినియోగదారులు ఇప్పటి నుంచే పొదుపు చర్యలు పాటించాలని అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా చిన్న చిన్న అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా గణనీయమైన విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉందని ప్రచారం చేస్తోంది.
పాటించాల్సిన సూచనలు
ఇళ్లలో ఎవరూ లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయాలి. అవసరం లేని లైట్లను ఆర్పివేసి, ఎల్ఈడీ బల్బులను వినియోగించాలి. గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లు ఆఫ్ చేయడంతో పాటు, వాటి వేగాన్ని అవసరానికి అనుగుణంగా నియంత్రించాలి. ఏసీ వినియోగాన్ని తగ్గించి, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. గది చల్లబడిన తర్వాత ఉష్ణోగ్రతను తగిన స్థాయిలో ఉంచడం మంచిది. మోటార్లు, నీటి మోటార్లు అవసరమైనప్పుడే నడపాలి. టీవీని చూడనప్పుడు, ఫ్రిజ్ తలుపును తరచూ తెరవకుండా, చార్జర్లు ఉపయోగించిన తర్వాత ప్లగ్ నుంచి తొలగించడం వంటి చర్యలు పాటించాలి. దుకాణాలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లోనూ విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలి. వ్యవసాయ బోర్లు, మోటార్లను అవసరమైన మేరకే వినియోగించాలి. అనవసరంగా విద్యుత్ పరికరాలను ఆన్న్లో ఉంచడం వల్ల శక్తి వృథాతోపాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి, సామాజిక ప్రయోజనం కోసం ప్రతి వినియోగదారుడూ సహకరించాలని ఎన్పీడీసీఎల్ సూచిస్తోంది.
అవసరమున్నంతే వినియోగించాలి
ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే విద్యుత్ ఆదా సాధ్యమవుతుంది. ప్రజలందరూ విద్యుత్ పొదుపు చర్యలు పాటించి సంస్థకు సహకరించాలని కోరుతున్నాం.
– సంపత్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ
విద్యుత్ ఆదా మార్గాలపై ఎన్పీడీసీఎల్ ప్రచారం
ఎల్‌నినో ప్రభావంతో వినియోగం పెరిగే అవకాశం
ప్రతీ వినియోగదారుడు బాధ్యతగా తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు


