సరైన వివరాలు
అందించాలి..
జిల్లాలో డిజిటల్ క్రాప్
బుకింగ్ సర్వే 76.4 శాతం
సర్వే వివరాలు:
జనగామ రూరల్: జిల్లాలో వానాకాలం సాగు లెక్కతేల్చడానికి వ్యవసాయశాఖ అధికారులు డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేపట్టారు. జిల్లా వ్యవసాయ అధికారితో పాటు ఏడీఏల పర్యవేక్షణలో జిల్లాలోని 280 గ్రామపంచాయతీల్లో 62 మండల అధికారులు, 176 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 76.4 శాతం పూర్తయింది. సర్వేలో రాష్ట్ర స్థాయిలో 19వ స్థానంలో నిలిచింది. అయితే ధాన్యం చేతికి వచ్చే దశ రావడంతో సర్వే నమోదు ప్రక్రియ ముమ్మరం చేశారు. 10 రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.. సర్వేనంబర్ వారీగా సాగు చేసిన పంట వివరాలు.. ఫొటోలను క్రాప్ బుకింగ్ మొబైల్ యాప్‌లో జియో ట్యాగింగ్ ద్వారా నమోదు చేస్తున్నారు.
నెట్‌వర్క్ సమస్యలు..
గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల నెట్‌వర్క్ సమస్యలు తలెత్తుతున్నట్లు వలంటీర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కేడేస్టల్ మ్యాప్ లేని గ్రామాల్లో సర్వే ఆలస్యమవుతోంది. సర్వే ద్వారా జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే కచ్చితమైన రావడంతో వివరాలు పాటు పంటల దిగుబడిని అంచనా చేసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. క్రాప్ బుకింగ్ సర్వే ద్వారా కొన్ని పంటలకు మద్దతు ధర లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
రైతులకు విస్తృత అవగాహన
పంట సర్వే నమోదుపై గ్రామాల్లోని రైతులకు వి స్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. పంట నమోదు ద్వారా కలిగే ఉపయోగాలు వివరిస్తున్నారు. అలాగే ఎల్‌నినో వానాకాలం సాగుపై ఎంతమేర ప్రభావం చూపిందనే లెక్క సర్వేతో తేలనుంది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ భారీ వర్షాలు లేక చెరువులు వెలవెలబోతుండగా, భూగర్భ జలాలు అడుగంటాయి. సాగు ప్రారంభంలోనే ప్రభుత్వం ఎల్‌నిలో ప్రభావం ఉంటుందని, ఆరుతడి పంటల సాగువైపు రైతులను మళ్లించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయినా రైతులు మాత్రం ఎక్కువ శాతం వరి, తక్కువ భాగంలో పత్తి సాగు చేస్తున్నారు. కూరగాయల సాగుకు సంబంధించిన పంట లెక్క సజావుగా కొనసాగుతోంది. వ్యవసాయ విస్తరణ అధికారులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులు సాగు చేసిన పంట వివరాలు నమోదు చేస్తున్నారు. పంట లెక్కల ఆధారంగా ప్రభుత్వం రైతులకు అందించే వివిధ పథకాల అమలు, పంటల ప్రణాళిక, దిగుబడి అంచనాలు రూపొందించడం సులభమవుతుంది. జిల్లాలోని 12 మండలాల్లో క్రాప్ బుకింగ్‌లో 77 శాతంతో మొదటి స్థానంలో కొడకండ్ల నిలవగా, 48 శాతంతో చివరి స్థానంలో రఘునాథపల్లి నిలిచింది. మిగిలిన మండలాల్లో 60 నుంచి 70 శాతం వరకు చేరుకుంది.
10 రోజుల్లో పంట లెక్కల ప్రక్రియ ముగియనుంది. సర్వే పూర్తిచేసి సమగ్ర నివేదికను ఉ న్నతాధికారులకు సమర్పిస్తాం. ధాన్యం విక్రయం ఇతర అవసరాలకు ఉపయోగపడనున్నది. రైతులు సరైన వివరాలు అందించి సహకరించాలి.
– అంబికా సోని,
జిల్లా వ్యవసాయ అధికారి
రాష్ట్ర వ్యాప్తంగా 19 స్థానం
సర్వేలో 62 మంది వ్యవసాయ అధికారులు, 176 మంది వలంటీర్లు
ప్రతీ రైతు సమాచారం ఆన్‌లైన్ నమోదు
మొదటి స్థానంలో కొడకండ్ల,
చివరి స్థానంలో రఘునాథపల్లి
మొత్తం క్రాప్ సర్వే ప్లాట్స్ 5,47,309
పూర్తయిన సర్వే ప్లాట్స్ 4,18,050
చేయాల్సిన సర్వే ప్లాట్స్ 1,29,259
మొత్తం శాతం 76.40


