రెండేళ్లుగా సమస్య
సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలి
ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి
జనగామ: విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఫారెన్‌న్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ)లో అర్హత సాధించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్‌ఎంజీ) సమాన స్టైఫండ్ కోసం ఆందోళన బాట పట్టారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో గురువారం నిరసన తెలిపారు. దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇంటర్న్‌లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు అదే స్థాయిలో స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అర్హత ఒకటే.. విధులు ఒకటే
ఎన్‌న్‌ఎంసీ నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం ఎఫ్‌ఎంజీఈలో అర్హత సాధించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్లినికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నామని ఎఫ్‌ఎంజీలు తెలిపారు. ఓపీ, వార్డులు, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు సర్జన్లకు సహకారం, రోగుల పర్యవేక్షణ వంటి విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాధారణ విధులతో పాటు నెలలో ఐదు రోజులపాటు నైట్ డ్యూటీలతో కలిపి 28 గంటల ఎమర్జెన్సీ విధులు కూడా నిర్వహిస్తున్నామన్నారు.
రూ.5 వేలతోనే సరిపెడుతున్నారు..
దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ అందుతుండగా, తమకు కేవలం రూ.5 వేలు మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారన్నారు. సమాన అర్హతలు కలిగి, సమానమైన వైద్య సేవలు అందిస్తున్నప్పుడు స్టైఫండ్‌లో వ్యత్యాసం చూపడం అన్యాయమంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది
జిల్లాలో 22 మంది ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లు పనిచేస్తుండగా, రాష్ట్రవ్యా ప్తంగా సుమారు 800 మంది ఉన్నారు. దేశంలోని రాజస్థాన్‌న్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి అర్హత సాధించిన ఇంటర్న్‌లకు స్థానిక ఎంబీబీఎస్ ఇంటర్న్‌లతో సమానంగా స్టైఫండ్ అందుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోనూ అదే విధానం అమలు చేయాలని కోరారు. ఇంటర్న్‌లకు మద్దతుగా కల్నల్ డాక్టర్ భిక్షపతి మాట్లాడుతూ.. ఎఫ్‌ఎంజీ విద్యార్థులు అడుగుతున్నది న్యాయమైన హక్కు అని, ఎంబీబీఎస్ విద్యకు కుటుంబాలు పెద్ద ఎత్తున ఆర్థిక భారాన్ని భరిస్తున్నాన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు సుమారు రూ.160 స్టైఫండ్ ఇవ్వడం సరిపోదని, స్థానిక ఎంబీబీఎస్ ఇంటర్న్‌లతో సమానంగా చెల్లించాలని సూచించారు.
సమాన స్టైఫండ్ కోసం రెండేళ్లుగా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 23న డీఎంఈకి వినతిపత్రంతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించినా ఇప్పటి వరకు స్పష్టమైన పరిష్కారం చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఓపీ సేవలకు దూరంగా ఉండాలని, 11, 12, 13 తేదీల్లో విధులకు పూర్తిగా గైర్హాజరు కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 14న హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపట్టి తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
జీజీహెచ్‌లో ఎఫ్‌ఎంజీ హౌస్ సర్జన్ల
ఆందోళన
నెలకు రూ.5 వేలతో
సరిపెడుతున్నారని ఆవేదన
ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు ఇస్తున్న రూ.29,792 చెల్లించాలని డిమాండ్
అర్హతలు పూర్తి చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమాన విధులు నిర్వహిస్తున్నప్పుడు స్టైఫండ్‌లో వ్యత్యాసం ఉండకూడదు. ప్రభుత్వం సమస్యను సానుకూలంగా పరిశీలించాలి.
– డాక్టర్ పి.త్రిశూల్‌రెడ్డి
ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లు వైద్య సేవల్లో కీలకంగా భాగస్వాములవుతున్నారు. వారి ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమాన స్టైఫండ్ అందేలా చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ పసుపులేటి మనోజ్ఞ


