తేమ ఉన్నా తగ్గేదేలే! | - | Sakshi
Sakshi News home page

తేమ ఉన్నా తగ్గేదేలే!

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

జనగామ: ధాన్యం మార్కెట్‌లో ఈసారి సీన్‌ మారింది..వానాకాలం పంట అడుగుపెట్టగానే ధర పరుగులు పెడుతోంది. తేమ 30–40 శాతం ఉన్న సాధారణ రకం ధాన్యానికీ క్వింటాల్‌కు రూ.2,400కుపైగా ధర పలుకుతుండగా, మద్దతు ధరను మించి ప్రైవేట్‌ కొనుగోళ్లు సాగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 5 వేలకుపైగా బస్తాలు మార్కెట్‌కు చేరడం డిమాండ్‌కు అద్దం పడుతోంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో గత సీజన్‌లో దిగుబడులు తగ్గడం, రానున్న వానాకాలం సీజన్‌లోనూ దిగుబడి తగ్గే అవకాశాల నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధాన్యానికి డిమాండ్‌ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

గతేడాది రూ.1,600..

గతేడాది ఇదే సమయంలో 30 నుంచి 40 శాతం తేమ ఉన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,600 నుంచి రూ.1,750 వరకు మాత్రమే ధర లభించింది. ప్రస్తుతం అదే స్థాయిలో తేమ ఉన్న ధాన్యానికి రూ.2,300 నుంచి రూ.2,450లకు పైగా ధర పలు కుతోంది. ప్రభుత్వం తాజాగా పెంచిన మద్దతు ధర ప్రకారం ఏ–గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, కామన్‌ రకానికి రూ.2,441గా నిర్ణయించింది. అయితే జనగామ మార్కెట్‌లో ప్రైవేట్‌ కొనుగోళ్లలో ఈ ధరను మించి కొనుగోళ్లు జరుగుతున్నాయి. సోమవారం ప్రైవేట్‌గా అత్యధికంగా క్వింటాల్‌కు రూ.2,473 ధర పలికింది. మోడల్‌ ధర రూ.2,021గా నమోదైంది.

మిల్లర్ల కొనుగోళ్లతో పోటీ

రైస్‌ మిల్లులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తుండటంతో సీఎంఆర్‌ ధాన్యం విషయంలో మిల్లర్లు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో షార్టేజ్‌ ఏర్పడితే దాన్ని భర్తీ చేసేందుకు మిల్లర్లు ప్రస్తుతం మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాకినాడ ఎగుమతులకు డిమాండ్‌ పెరగడంతో గతంలో క్వింటాల్‌కు రూ.2,800గా ఉన్న ధర ప్రస్తుతం రూ.3,300కు చేరినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలన్నీ ధాన్యం ధర పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. దీంతో పాటు పరం, తవుడు, ఉనుక ధరలు సైతం అమాంతం పెరగడంతో ఈసారి ధాన్యానికి ఇదే ధరలు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పొరుగు జిల్లాల నుంచి వ్యాపారులు

మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో సూర్యాపేట, తిరుమలగిరి, భువనగిరి, సిద్దిపేట తదితర ప్రాంతాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో కొనుగోళ్లకు పోటీ పెరిగింది.

రైతుల్లో పెరిగిన ఆశలు

30–40 శాతం తేమ ఉన్నప్పటికీ రూ.2,400కుపైగా ధర లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊహించిన దానికంటే ధర ఎక్కువగా రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా జనగామ మార్కెట్‌కు ధాన్యం తరలించే అవకాశం ఉంది. ప్రస్తుత డిమాండ్‌ కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

వానాకాలం ధాన్యానికి ఫుల్‌ గిరాకీ

జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో

క్వింటాల్‌ ధర రూ.2,400 పైనే!

మద్దతు ధరను మించి వస్తుండడంతో రైతుల హర్షం

సీఎంఆర్‌ షార్టేజీ భర్తీకి మిల్లర్ల పోటీ కొనుగోళ్లు..?

ఎగుమతులతో ఊపందుకున్న ధాన్యం ధరలు

ఊహించని ధర వచ్చింది..

ప్రభుత్వ మద్దతు కంటే ప్రైవేట్‌ మార్కెట్‌లో ధాన్యానికి ఊహించిన దాని కంటే ధర బాగా వచ్చింది. మూడు ఎకరాల్లో వరి సాగు చేయగా, రూ.75వేల వరకు పెట్టుబడికి ఖర్చు చేసిన. 175 బస్తాల వరకు దిగుబడి రాగా, క్వింటాల్‌ ధర రూ.2,453 ధర వచ్చింది.

–పి.శ్రీనివాసరెడ్డి, రైతు, కళ్లెం

ధరలో రికార్డు..

ధాన్యం ధరలో వ్యవసాయ మార్కెట్‌ రికార్డు సృష్టించింది. క్వింటాల్‌ ధాన్యం రూ.2,473, రూ.2,453, రూ.2,021 ధరలు పలికాయి. రైతులకు మంచి ధర రావడంతో పాటు ఎక్కడా కూడా నష్టం జరగకుండా మార్కెట్‌ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

–బనుక శివరాజ్‌ యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement