● ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
● అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం
● ప్రజల నుంచి 405 దరఖాస్తుల స్వీకరణ
జనగామ రూరల్: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి తమ గోడును వినిపించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 405 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్‌లో లేకుండా దరఖాస్తులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కాగా, అర్జీల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పెన్షన్‌లవే ఉన్నాయి. ప్రజావాణిలో జెడ్పీ సీఈఓ బలరామరావు, డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
● జఫర్‌గఢ్ మండలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన సీహెచ్.అనిత, తనకు పెంకుటిల్లు ఉండగా అది కూలిపోయిందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గుర్తించి, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు.
● లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన బండ్రు సారమ్మ, తనకు మూడు ఎకరాల భూమి ఉందని, అందులోని 16 గుంటల భూమి రికార్డుల్లోకి ఎక్కలేదని, ఆ భూమిని రికార్డులోకి ఎక్కించి, పట్టా ఇప్పించగలరని దరఖాస్తు చేసుకున్నారు.
● బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి, సదాశివపేట, నారాయణపురం మధ్యలో కాలువ తెగిపోయిందని వ్యవసాయ పనులకు ఇబ్బందులు పడుతున్నామని కాలువ మరమ్మతులు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
● స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన రేష్మా, తన పెంకుటిల్లు కూలిపోయే దశలో ఉందని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పేద కుటుంబానికి చెందినదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.


