● కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: వానాకాలం 2026–27 సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 202 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్టు 1800–425–6605 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో ట్రక్ షీట్ నిర్వహణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్ రెడ్డి, డీఎం సివిల్ సప్లై హతీరామ్, డీసీఓ కరుణ, ఎల్‌డీఎం ప్రతిభ, తూనికలు కొలతల శాఖ అధికారి ఝాన్సీ, రవాణా, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు..
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ, పెండింగ్ దరఖాస్తులపై అదనపు కలెక్టర్ బెన్‌షామ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే దరఖాస్తులను ఆమోదించడం తిరస్కరించడం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో హౌజింగ్ పీడీ బలరామరావు, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


