జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,410 ఉండగా, సోమవారం మార్కెట్‌లో గరిష్టంగా రూ.2,452 ధర పలికింది. మోడల్ ప్రైస్ రూ.2,275గా నమోదైంది. పది రోజులుగా మార్కెట్‌కు మొక్కజొన్నలు వస్తుండగా, ఊహించిన విధంగానే ధరలు పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల పరిశ్రమలతో పాటు ఇతర అవసరాలకు మొక్కజొన్నకు డిమాండ్ పెరగడం, దిగుబడి అంతంత మాత్రంగానే ఉండడంతో ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న ధరకు అదనంగా క్వింటాల్‌కు మరో రూ.100 పెంచి ఇస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ధర సంతోషం కలిగించింది..
మూడెకరాలు సాగు చేసిన. రూ.30వేల వరకు పెట్టుబడులు ఖర్చు చేసిన. వర్షాభావ పరిస్థితులతో రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఒక ఎకరం పంటను రెక్కలు ముక్కలు చేసుకుని కాపాడిన. 42 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ. 2,425 ధర పలికింది. ఇంత ధర వస్తదనుకోలేదు.
–ముసుకు కుమారస్వామి, రైతు, అయ్యంగార్‌పల్లి, పాలకుర్తి
●


