జనగామ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జిల్లాలో ఎందరో ఉద్యమకారులు ఆత్మబలిదానం చేయగా, మరికొందరు ఆత్మహత్యాయత్నం చేసి తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించింది. గాయపడిన ఉద్యమకారులకు సైతం కొంత ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. ఆ కుటుంబాలు నేటికీ ఆనాటి ఘటనలను గుర్తుకుచేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నాయి.
బచ్చన్నపేట: మన్‌సాన్‌పల్లి యువకుడు పొన్నం అశోక్ స్వరాష్ట్ర సాధన కోసం తన వ్యవసాయ పొ లం వద్ద సూసైడ్ నోట్ రాసి ఆత్మార్పణం చేశాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోరు మరింత ఉధృతానికి దారి తీసింది. రాష్ట్రం ఏర్పడ్డాక అమరుడి తమ్ముడు రవికి రెవెన్యూ శాఖలో ఉద్యోగంతో పాటు కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం ప్రభుత్వం అందించింది. కట్కూరులో రవి అనే యువకుడు ట్యాంకుపై నుంచి దూకాడు.
జఫర్‌గడ్: తెలంగాణ సాధన ఉద్యమంలో మండలం పోరుబాట పట్టింది. తిమ్మంపేటలో పైపులైన్ల దహనం, సెల్‌టవర్ ఎక్కి నిరసన కేసులో మాజీ సర్పంచ్ మంద రాజయ్య సహా 8 మంది జైలుకు వెళ్లారు. అల్వాల్ బండ తండా సురేష్ నాయక్ ఆత్మహత్య, కూనూరు కొమురారెడ్డి బెంగతో మృతి చెందగా వారి కుటుంబాలకు ఉద్యోగం, రూ.10 లక్షల సాయం అందింది.
స్టేషన్‌ఘన్‌పూర్: శివునిపల్లి ఆటో డ్రైవర్ నలిమల శ్రీనివాస్ (21) అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి జిల్లాను కుదిపేసిన ఈ ఘటన తర్వాత కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల పరిహారం ఇప్పటికీ అందలేదని తల్లి జయ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
నర్మెట: హనుమంతపురం గ్రామానికి చెందిన మ్యాక అరుణ, కొమురయ్య దంపతుల పెద్ద కుమారుడు మ్యాక శ్యాంకుమార్ ఉద్యమంలో 2011మార్చి 2న ఉరేసుకున్నాడు. అమరుడి తమ్ముడు మ్యాక సతీష్‌కు ఉద్యోగం, కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు.
చిల్పూర్: రాజవరానికి చెందిన దివంగత మాజీ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో నష్కల్ వద్ద రైల్‌రోకో నిర్వహించారు. సంపత్‌రెడ్డి, జనగామ యాదగిరి, రాజేశ్వర్‌రెడ్డి సహా ఎనిమిది మందిపై కేసులు నమోదై జైలుకు వెళ్లారు.
కొడకండ్ల: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు, రిలే నిరాహార దీక్షలతో ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది. గిర్నితండాకు చెందిన ధరావత్ గాంధీ నాయక్ మూడేళ్ల పాటు ‘అరగుండు అరమి గాంధీ’ పేరుతో వినూత్నంగా నిరసన తెలిపి కరుడుగట్టిన ఉద్యమకారుడిగా గుర్తింపు పొందారు.
లింగాలఘణపురం: తెలంగాణ ఉద్యమ సమయం 2010లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మార్పణం చేసిన లింగాలఘణపురం మండలం నవాబ్‌పేటకు చెందిన ముత్తినేని శ్రీనివాస్ త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించింది. 2016లో భార్య మంజులకు నీటిపారుదల శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఉద్యోగం కల్పించడంతో పాటు రూ.10 లక్షలు అందించింది.
పాలకుర్తిటౌన్: 2012 జనవరి 5న చంద్రబాబు పాదయాత్రకు నిరసనగా జీడి హరీష్ పోలీస్ స్టేషన్‌లోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడంతో అరెస్టయ్యాడు. మండలంలో 47 మంది ఉద్యమకారులపై కేసులు నమోదయ్యాయి.
రఘునాథపల్లి: మండలంలో అశ్వరావుపల్లి శివారు వీరారెడ్డితండాకు చెందిన బోజ్యనాయక్, వెల్ది గ్రామానికి చెందిన వంగాల రాజు, రఘునాథపల్లికి చెందిన బైరగోని రాజు తెలంగాణ కోసం ప్రాణాలు ఆర్పించి చరిత్రలో నిలిచిపోయారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మబలిదానాలు
అమరుల కుటుంబాలకు
రూ.10లక్షలు, ఉద్యోగం
ఆనాటి ఘటనలు..ఉద్యమ స్మృతులు


