జనగామ: జిల్లా కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించిన మూడు మెడికల్ షాపుల లైసెన్స్‌లను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఏలె బాలకృష్ణ తెలిపారు. మంగళవారం పట్టణంలో మెడికల్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాలు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. దీనిపై పూర్తి నివేదికను వరంగల్ సహాయ సంచాలకుడు, ఔషధ నియంత్రణ శాఖకు సమర్పించారు. సహాయ సంచాలకుల ఉత్తర్వుల మేరకు జనగామ ఫార్మసీ లైసెన్సును 7 రోజులు, సిద్ది పేటరోడ్డులోని మెడ్‌ప్లస్ ఫార్మసీ లైసెన్సును 3 రోజులు, లావణ్య మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లైసెన్సును 2 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. నిబంధనలు పాటించని మెడికల్ దుకాణాలపై ఇకపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఘన్‌పూర్ ఆర్డీఓగా కిరణ్ ప్రకాశ్ బాధ్యతల స్వీకరణ
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ నూతన ఆర్డీఓగా కిరణ్‌ప్రకాశ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఘన్‌పూర్ ఆర్డీఓగా పనిచేసిన డీఎస్ వెంకన్న బదిలీపై పరకాలకు వెళ్లగా ఆయన స్థానంలో కరీంనగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. కాగా నూతన ఆర్డీఓ కిరణ్‌ప్రకాశ్‌ను ఘన్‌పూర్ తహసీల్దార్ సంధ్యతో పాటు ఆర్‌ఐలు, రెవెన్యూ అధికారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
జనగామ రూరల్: అల్పసంఖ్యాక వర్గాల (ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) వారు విదేశాల్లో పైచదువులకు గాను సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి విక్రమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో చదివేందుకు అవకాశం ఉందని, 1 జనవరి 2026 నుంచి 30 జూన్ 2026 మధ్య కాలంలో అడ్మిషన్ తీసుకున్న అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ధ్రువపత్రాలు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని, ఎంపిక చేయబడిన ప్రతీ విద్యార్థికి స్కాలర్ షిప్ / ఆర్థిక సాయం కింద రూ.20లక్షలను రెండు విడతల్లో అందజేస్తారన్నారు. విమాన ప్రయాణ చార్జీలు రూ.60వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. జూన్ 30 సాయంత్రం 5.00 గంటల వరకు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 9951933034, 9346951278లో సంప్రదించాలన్నారు.
అగ్నిప్రమాదంలో
రూ.5లక్షల ఆస్తి నష్టం
స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ శివారు కొత్తపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలోని వ్యవసాయ భూముల వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరగగా వ్యవసాయ భూముల వద్ద పైపులైన్‌లు, మోటార్లు, స్టార్టర్లతో పాటు పక్కనే ఉన్న నర్సరీ దహనం కాగా దాదాపు రూ.5 లక్షలు నష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న చింతకుంట్ల శైలేందర్‌రెడ్డి వ్యవసాయ భూమిని నీల గట్టయ్య అనే రైతు కౌలుకు చేస్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంతో దాదాపు పది ఎకరాల వ్యవసాయ భూమిలో వరికొయ్యలతో పాటు పైపులు, పైపులైన్‌లు, మోటార్లు, స్టార్టర్లు దహనమయ్యాయి. అదేవిధంగా పక్కనే ఉన్న లక్ష్మీప్రసన్న నర్సరీలో డ్రిప్ పైపులు, పరదాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కౌలురైతుకు రూ.2లక్షలు నష్టం వాటిల్లగా, నర్సరీ వారికి రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లింది. కాగా బాధిత రైతులు అందించిన సమాచారం మేరకు స్టేషన్‌ఘన్‌పూర్ అగ్నిమాపక శాఖ ఎస్‌ఎఫ్‌ఓ దేవేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.


