ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
జనగామ: సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో విప్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్‌తో కలిసి బీర్ల ఐలయ్య తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. విప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ గడ్డకు ప్రత్యేక స్థానం ఉందని, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య వంటి మహనీయుల పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైందని అన్నారు.
అన్ని వర్గాలకు సంక్షేమం
జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కింద అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తున్నాయని విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా వేలాది కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లాకు మంజూరైన 5,738 ఇళ్లలో అత్యధిక శాతం పనులు పూర్తవడంతో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. రైతు భరోసా, రైతుబీమా ద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఆయిల్‌పామ్ విస్తరణ, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ల పంపిణీతో ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
మహిళలకు పెద్దపీట
మహిళా సాధికారతలో భాగంగా లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సోలార్ పవర్ యూనిట్లు, మిల్క్ పార్లర్లు, కోళ్ల పెంపకం, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు, బస్సుల నిర్వహణ వంటి ఆదాయ వనరులు కల్పిస్తున్నామని చెప్పారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రెయినేజీలు, టౌన్ హాళ్లు, పార్కులు, మా ర్కెట్లు, లైబ్రరీలు, ఓపెన్ జిమ్‌లు నిర్మిస్తున్నట్లు వివరించారు.
రుణాల చెక్కులు అందజేత
బ్యాంకు లింకేజీ ద్వారా చాకలి ఐలమ్మ సమాఖ్య ద్వారా 9,533 సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు రూ.71.94కోట్లు, సీ్త్ర నిధి ద్వారా ఇదే సమాఖ్య పరిధిలోని 191 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.4.90కోట్ల చెక్కులను విప్ అందించారు. ఐకేపీ నిర్వాహకులకు 2024–25, 2025–26 సంవత్సరాలకు చెందిన కమీషన్ రూ.2.12కోట్ల చెక్కుతో పాటు ఇందిరమ్మ ఇళ్ల ధ్రవీకరణ పత్రాలను అందజేశారు. దివ్యాంగులకు ట్రైసికిళ్లు, స్కూటీలు అందించారు. అంతకు ముందు క్రీడాపోటీల్లో విజేతలకు మెడల్స్, ప్రశంసపత్రాలు అందజేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల పురస్కరించుకుని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు ఆకట్టుకున్నాయి. మైత్రేయ కూచిపూడి నాట్య కళాక్షేత్రం, లింగాలఘణపురం, నర్మెట మండలాల కేజీబీవీ విద్యార్థినులు, జనగామ సాన్ మేరి యా ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించాయి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ చిన్నారుల ప్రతిభను కొనియాడారు.
02జెజిఎన్714,715:రాష్ట్ర అవతరన వేడుకల్లో విద్యార్థి నుల సాంస్కృతిక ప్రదర్శనలు


