మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026
త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులు
సర్వం సిద్ధం
● రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
● డీసీపీతో కలిసి పనులను పరిశీలించిన
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జిల్లా సర్వం సిద్ధమైంది. నేడు(మంగళవారం) జరుగనున్న వేడుకల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ ఆవరణలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం పనులను పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక, అతిథుల కూర్చునే ఏర్పాట్లు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారి శుద్ధ్యం, భద్రత, తదితర అంశాలపై కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నేటి కార్యక్రమాలు..
● జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 7.45 గంటలకు ముఖ్య అతిథి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు.
● 8 గంటల నుంచి 8.10 గంటల లోపు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.
● 8.10 గంటల నుంచి 8.30 గంటల వరకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్య అతిథి ప్రసంగిస్తారు.
● 8.30 గంటల నుంచి 8.45 వరకు జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులతో తెలంగాణ రాష్ట్ర సాధనను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
● 8.45 గంటల నుంచి 9 గంటల వరకు అసెట్స్ పంపిణీ, బహుమతులు ప్రదానం చేస్తారు.
గ్రీవెన్స్‌లో వినతి..
గంటలోనే పరిష్కారం
● కలెక్టర్ చొరవతో సొంతింట్లోకి వృద్ధురాలు
జనగామ: గ్రీవెన్స్‌లో వచ్చిన వినతిపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గంటలోపే స్పందించి వృద్ధురాలి సమస్యను పరిష్కరించారు. దీంతో పట్టణానికి చెందిన పబ్బాని నరసమ్మ తిరిగి తన సొంతింట్లో నివాసం ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నరసమ్మ కలెక్టర్‌ను కలిసి తన బాధను చెప్పుకున్నారు. ఇద్దరు కుమారులు పట్టించుకోవడం లేదని, భర్త పబ్బాని నర్సయ్య పేరున ఉన్న వీవర్స్ కాలనీ ఇంట్లో ఉండలేక అద్దె గదిలో తలదాచుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధురాలి గోడును సానుభూతితో విన్న కలెక్టర్ వెంటనే రెవెన్యూ అధికారులను క్షేత్రస్థాయికి పంపి విచారణకు ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నరసమ్మ కుమారులు, కుటుంబ సభ్యులను పిలిపించి ఆమె సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లి పోషణ బాధ్యతను చేపట్టాలని సూచించగా, ఇకపై తల్లిని తమతోనే ఉంచుకుంటా మని కుమారులు హామీ ఇచ్చారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో గంటల వ్యవధిలో సమస్య పరిష్కారం కావడంతో నరసమ్మ తన సొంతింట్లోకి వెళ్లారు.
జనగామ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత చిన్న జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జనగామకు జిల్లా హోదా దక్కడం అభివృద్ధికి దోహదపడింది. ఒకప్పుడు కరువు, తాగునీటి కొరత, తక్కువ సాగు, మౌలిక వసతుల కరువైన గుర్తింపు పొందిన జిల్లా నేడు తాగు, సాగునీరు, వ్యవసాయం, వైద్యం, విద్య, రవాణా, విద్యుత్, పరిపాలన తదితర రంగాల్లో గణనీయమైన మార్పులను నమోదు చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది.
ఇంటింటికీ మిషన్ భగీరథ
తాగునీటి రంగంలో మిషన్ భగీరథ పథకం జిల్లాలో కీలక మార్పుకు నాంది పలికింది. సుమారు రూ.800 కోట్ల వ్యయంతో జిల్లాలో 1.28 లక్షలకు పైగా ట్యాప్ కనెక్షన్లు ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్నారు.
వైద్యరంగంలో విప్లవాత్మకం
మెడికల్ కళాశాల మంజూరు కావడం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) 300 పడకలతో ఆధునిక సౌకర్యాలతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, చంపక్‌హిల్స్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన క్రిటికల్ కేర్ హాస్పిటల్(ట్రామా) సేవలు వచ్చాయి. స్టేషన్ ఘన్‌పూర్‌లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా వైద్య సేవల విస్తరణకు దోహదపడుతోంది. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గఢ్‌లో డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడంతో పేద కుటుంబాలకు ఆర్థిక బారం తగ్గింది.
జలకళ..పెరిగిన వ్యవసాయం
జిల్లాలో మొత్తం నాలుగు లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, మేజర్, మైనర్ కాలువల నిర్మాణం కోసం పెద్దఎత్తున భూసేకరణ చేపట్టడం, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి వనరుల అభివద్ధి వంటి చర్యలు వ్యవసాయాభివృద్ధికి బలాన్ని చ్చాయి. మిషన్ కాకతీయ ద్వారా ఊరూరా గొలుసుకట్టు చెరువుల పూడికతీత, అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు గోదావరి జలాలను చెరువులకు తరలించే కార్యక్రమాలు జిల్లాలో భూగర్భ జలాలను పెంచాయి.
రోడ్ల విస్తరణ..
రవాణా, మౌలిక వసతుల రంగాల్లో జనగామ–దుద్దెడ రహదారి విస్తరణతో పాటు మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించారు. జనగామ రైల్వే స్టేషన్‌ను రూ.100 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తుండగా, తొలి విడతలో రూ.25 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు. స్టేషన్‌ఘన్‌న్‌పూర్‌లో ఫ్లైఓవర్, ఫైర్ స్టేషన్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
కార్పొరేట్ స్థాయిలో సర్కారు విద్య
జిల్లాలో జ్యోతిబాఫూలే, మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా పొందే అవకాశం కల్పించారు. కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణం, జిల్లా పరిపాలనా వ్యవస్థ విస్తరణ, బతుకమ్మకుంట సుందరీకరణ వంటి కార్యక్రమాలు జిల్లా కేంద్రానికి కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి.
జనగామ: 2001న మొదలైన ఉద్యమం 2014 ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించే వరకు జనగామ ప్రాంతం ఉద్యమ పతాకగా నిలిచింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన తర్వాత సంచలనాలకు జనగామ కేంద్రబిందువైంది. 2012 జనవ రి 23న జనగామలో జరిగే ‘దీక్షల సంవత్సరం’ పురస్కరించుకుని జేఏసీ ప్రత్యేక కరపత్రం విడుదల చేశారు. నేటికి (మంగళవారం) తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అనాటి ఉద్యమ జ్ఙాపకాలను మరోసారి నెమరువేసుకొనే ప్రత్యేక కథనం..
దీక్షలు..జేఏసీలు
22 జనవరి 2010లో జనగామ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో 120 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. అందులో పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఆతర్వాత తెలంగాణ వచ్చే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, టీయూటీజేఏసీ వంటి పార్టీలతో పాటు డాక్టర్లు, లాయర్లు, విద్యావంతులు, విద్యార్థి సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని నడిపించారు. టీయూటీజేఏసీ అనుబంధ సంఘాలతో పాటు కార్మిక సంఘాలు, కాంట్రాక్టర్ల అసోసియేషన్, ఆటో డ్రైవర్లు, యువజన సంఘాలు, వృత్తి పని చేసుకునే యూనియన్లు, టీచర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉద్యోగుల సంఘాలు, కుల సంఘాలు, అనేక మంది సైతం దీక్షలకు సంపూర్ణ మద్దతు పలికి దీక్షల్లో కూర్చున్నారు.
రైల్‌రోకోలు..రాస్తారోకోలు
పట్టణంలో 400 రోజుకు పైగా నిర్వహించిన రిలే దీక్షలకు వేలాది మంది తరలిరావడానికి ఊరూరా చేపట్టిన కార్యక్రమాలు దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు అరైస్టె జైలుకు వెళ్లారు. రోజుల తరబడి రాస్తారోకోలు జరుగగా, శామీర్‌పేట, తదితర ప్రాంతాల్లో లారీలను తగులబెట్టగా, బస్సులు, వాహనాల అద్దాలు ధ్వంసం చేసిన ఘటనలు కో కొల్లలు. ఉద్యమ చరిత్రలో జిల్లా ఒక మైలురాయిగా నిలిచింది. 2014జూన్2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించడంతో దశాబ్దంన్నరకు పైగా సాగిన ఉద్యమానికి ఫలితం దక్కింది.
ఉద్యమ సమయంలో జనగామ చౌరస్తాలో జరిగిన నిరసనలో వందలాది మంది ప్రజలు (ఫైల్)
రిజర్వాయర్ పనుల పరిశీలన
పాలకుర్తి టౌన్: పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులపై మే 26న సాక్షిలో వచ్చిన ‘ఆగుతూ...సాగుతూ’ కథనంపై ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి స్పందించారు. సోమవారం చెన్నూరు రిజర్వాయర్‌ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈసందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల విషయంలో రాజీ పడబోమని తెలిపారు.
ముగిసిన పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
జనగామ రూరల్: పట్టణలలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాలిసెట్ –2026 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ కె.శ్రీనివాస్ సోమవారం తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 400మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ జె. శ్రీదేవి, వెరిఫికేషన్ ఆఫీసర్, డాక్టర్ రవీందర్ నాయక్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ కరుణాకర్, ఎ.కల్పన, కుమారస్వామి, కళావతి, సుజాత కుమార్ పాల్గొన్నారు.
తాగునీటి నుంచి వైద్యం వరకు..
సాగునీటి నుంచి విద్య వరకు..
అన్ని రంగాల్లో మారిన జిల్లా ముఖచిత్రం


