జనగామ: నేల ఆరోగ్యమే వ్యవసాయానికి పునాది అనే సూత్రంతో రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం 2026కు గాను పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై 50శాతం సబ్సిడీ ప్రకటించింది. జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాల ధరలను సగానికి తగ్గించడంతో రైతుపై పడే భారం సగానికి తగ్గింది. ఒక ఎకరానికి సగటున 20–25 కేజీల జీలుగ, జనుము విత్తనం సరిపోతుంది. అంటే ఎకరాకు పచ్చిరొట్ట ఎరువు ఖర్చు కేవలం రూ.1,635, రూ.1,945 మాత్రమే. డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా, యూరియా రూ.266 ఉన్న నేపథ్యంలో పచ్చిరొట్ట ద్వారా ఎకరాకు 25నుంచి 30 కేజీల నత్రజని సహజంగా అం దుతుంది. దీని విలువ రూ.1,500కు పైగానే. అంటే సబ్సిడీతో వేసే పచ్చిరొట్ట ఖర్చు దాదాపు రసాయన ఎరువుల ద్వారా వచ్చే నత్రజని విలువతో సమానం. నేల గుల్లబారడం, సూక్ష్మజీవులు పెరగడం అదనపు లాభం. దీంతో పంట దిగుబడి గణనీయంగా పెరగనుంది.
ఇలా చేస్తేనే నేల ఆరోగ్యం
వరుసగా రసాయన ఎరువులు వాడడంతో రాష్ట్రంలో 68 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం 0.5శాతం కంటే తక్కువకు పడిపోయింది. పచ్చిరొట్టతో 45 రోజుల్లోనే 0.2శాతం సేంద్రియ కర్బనం పెరుగుతుందని శాస్త్రవేత్తల అంచనా. కేంద్రం ఇచ్చే యూరియా సబ్సిడీ ఒక్కో బస్తాకు రూ.2,100 దాటింది. రైతు పచ్చిరొట్ట వేస్తే యూరియా వాడకం 25శాతం తగ్గుతుంది. అంటే పరోక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎరువుల సబ్సిడీ భారం తగ్గుతుంది. గతంలో సబ్సిడీ విత్తనాలు పక్కదారి పట్టేవి. ఈసారి ప్రభుత్వం ఆన్‌లైన్ ఈ పోర్టల్‌ను తప్పనిసరి చేసింది. అసలైన రైతుకే విత్తనం చేరుతుంది. బ్లాక్ మార్కెట్‌కు చెక్ పడుతుంది.
రైతు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు
● సకాలంలో కలియదున్నడం: పూతదశకు రాగానే, అంటే 45–50 రోజులకు కలియదున్నాలి. ఆలస్యమైతే కర్రగట్టి, కుళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంది.
● వరి నాటుకు ముందు 2 వారాలు: కలియదున్నిన తర్వాత కనీసం 15 రోజులు ఆగి వరి నాటాలి. లేదంటే పచ్చిరొట్ట కుళ్లే క్రమంలో వచ్చే వేడికి వరి మొక్కలు దెబ్బతింటాయి.
● ఆన్‌లైన్ పర్మిట్ తప్పనిసరి: మీ పేరును ఓఎస్ ఎస్‌డీఎస్‌లో నమోదు చేయించుకుని మండల వ్యవసాయాధికారి వద్ద పర్మిట్ తెచ్చుకోవాలి.
ఆన్‌లైన్ పర్మిట్ తప్పనిసరి
ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువులపై 50 శాతం సబ్సిడీ ప్రకటించింది. జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాల ధర సగం కావడంతో రైతుల ఖర్చు తగ్గి, ఎకరాకు 25–30 కేజీల సహజ నత్రజని లభిస్తుంది. సబ్సిడీ పొందాలంటే ముందుగా ఓఎస్‌ఎస్‌డీఎస్ ఆన్‌లైన్ పర్మిట్ తప్పనిసరి.
– అంబికా సోనీ, జిల్లా వ్యవసాయాధికారి
జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలపై
50శాతం సబ్సిడీ
రైతులపై తగ్గిన ఆర్థిక భారం
నేల ఆరోగ్యానికి పచ్చిరొట్ట పంటల
ప్రాధాన్యం
ఆన్‌లైన్ పర్మిట్ విధానంతో పంపిణీ
పచ్చిరొట్ట ఎరువుల ధరలు, సబ్సిడీ
పంట కేజీలు మొత్తం ధర సబ్సిడీ రైతు చెల్లించేది
జీలుగ 30 రూ.4,905 50శాతం రూ.2,452.50
జనుము 40 రూ.6,220 50శాతం రూ.3,110.00
పిల్లిపెసర 20 రూ.3,990 50శాతం రూ.1,995.00


