నేలకు జీవం | - | Sakshi
Sakshi News home page

నేలకు జీవం

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026
వ్యర్థం కాదు..

జనగామ: రైతులు పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే అవశేషాలను తగులబెట్టడం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొనసాగుతుండడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యర్థాలను తగుల బెట్టడం సర్కారు నిషేధించినా, పర్యావరణ చట్టాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా..కొంతమంది రైతులు అవగాహన లేక నిర్లక్ష్యంతో దహనానికి పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. పంట దహనం వల్ల కలిగే నష్టం, చట్టపరమైన శిక్షలు, ప్రత్యామ్నాయాలు వంటి వివరాలతో కూడిన కరపత్రాన్ని వ్యవసాయ శాఖ విడుదల చేసింది.

నేల సారవంతం తగ్గుతుంది..

పంట అవశేషాలను తగులబెట్టడం వాయు కాలుష్య నివారణ చట్టం–1981, పర్యావరణ సంరక్షణ చట్టం–1986 ప్రకారం నేరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పొగలో ఉండే పీఎం–2.5, పీఎం10 సూక్ష్మధూళికణాలు గాలిలో కలిసి మనుషులతో పాటు పశువులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ఈ పొగ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అవశేషాలను కాల్చడం వాతావరణా నికే కాదు, రైతు భూమికి సైతం నష్టం కలుగచేస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అవశేషాలతో కలిసి నేలలో ఉండే ప్రయోజనకర సూక్ష్మ జీవులు, పుట్టుగుళ్ళు నశించి నేల సారం తగ్గిస్తోంది. అంతేకాకుండా పంటలు తీసుకునే పోషకాల సమతౌల్యం దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. దహనం వల్ల భూమి ఉపరితలం కాచి, దీర్ఘ కాలంలో నేల పగుళ్లుబారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. దట్టమైన పొగ సమీప గ్రామాలపై కమ్ముకుని ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భాల్లో పక్కన పొలాలు, గుడిసెలు, పశువుల పాకల వరకూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.

చట్టపరంగా చర్యలు

ఇక చట్టపరంగా చూస్తే పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు సైతం ఉన్నాయి. పంటలను తగలబెడితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, సబ్సిడీల నిలుపుదల, బ్యాంకు రుణాలు మంజూరు కాకపోవడం, పునరావృతమైతే క్రిమినల్‌ విచారణ జరిపిస్తారు. పంట దహనం పూర్తిగా నేరమని, ప్రజారోగ్యానికి ప్రమాదకరమని సూచిస్తున్నారు. పంట అవశేషాలను దహనం చేయకుండా ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. రోటవేటర్‌, మల్చింగ్‌, సూ పర్‌ సీడర్‌, బయో–డీకంపోజర్‌ వంటి పద్ధతులు ఉపయోగిస్తే నేల సారపుష్టి పెరగడమే కాకుండా తదుపరి పంటకు మేలు జరుగుతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

సౌర ప్లాంట్‌ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

పంట అవశేషాల దహనంతో కాలుష్యం

నేల సారం తగ్గిపోతుందని నిపుణుల హెచ్చరిక

సూక్ష్మజీవులు, పుట్టుగుళ్ల నాశనం

భూమి నాణ్యతపై ప్రతికూల ప్రభావం

అగ్నిప్రమాదాల ముప్పు

దహనం వల్ల కలిగే నష్టం

నేలలోని కీటకాలు, సూక్ష్మజీవులు నశించడంతో నేలసారం తగ్గుతుంది.

కర్బన ఉద్గారాలు పెరిగి వాతావరణ మార్పులకు దారితీస్తాయి.

పొగ వల్ల పశువుల్లో శ్వాససమస్యలు, చర్మవ్యాధులు పెరుగుతాయి.

గాలి దిశ మారితే పక్క పొలాలు, ఇళ్లు, గోదాములు కాలిపోవచ్చు.

రైతులపై చట్టపరమైన చర్యలు

పంట వ్యర్థాలను కాల్చొద్దు..

పంట దహనం రైతు ఆరోగ్యానికి, పర్యావరణానికి, భూమి నాణ్యతకు ముప్పు. ఒక నిమిషం సౌలభ్యం కోసం భవిష్యత్‌ను ప్రమాదంలో పెట్టొద్దు. సుస్థిర వ్యవసాయం మన భవిష్యత్తు. పంట వ్యర్థాలను కాల్చడం చట్ట రీత్యా నేరం. పర్యావరణానికి హాని కలిగిస్తే చర్యలు తీసుకుంటాం. పంట వ్యర్థాలను కాల్చకుండా రైతులు, ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. – అంబికాసోని,జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
 
Advertisement
Advertisement